బాలీవుడ్‌లోనే కాదు మొత్తంగా దేశంలో ఉన్న అన్ని సినిమా పరిశ్రమల విషయంలో గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతున్న అంశం పని గంటలు. ఆ మాటకొస్తే అన్ని రంగాల్లోనూ ఈ చర్చ జరుగుతోంది. అటు తిరిగి, ఇటు తిరిగి ఇప్పుడు సినిమాల్లో వర్కింగ్ అవర్స్ అనే చర్చ ఎక్కువైంది. దీనికి ఆధ్యులు డైరెక్ట్‌గా కాదు కానీ ఇన్‌డైరెక్ట్‌గా ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, ప్రముఖ కథానాయిక దీపికా పడుకొణె.
వీళ్లిద్దరూ ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమా కోసం కలసి పని చేయాల్సిన వాళ్లే. అయితే ఏదో కారణంగా దీపిక ఆ సినిమా నుండి బయటకు వచ్చింది. ఆ కారణాల్లో పని గంటలు ఒకటి అని అంటున్నారు. దీని మీద ఇప్పటికే చాలా మంది స్పందించినా.. తాజాగా ప్రముఖ కథానాయికగా విద్యా బాలన్ ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఓ వైపు దీపిక ఆరు గంటలే పని చేస్తాను అని చెప్పింది అని వార్తలొస్తుంటే.. మరోవైపు విద్యా బాలన్ ఏకంగా 12 గంటలైనా పని చేస్తా అని అంటోంది.
వర్కింగ్ అవర్స్ గురించి విద్యా బాలన్ ఇటీవల తన అభిప్రాయాన్ని చెప్పింది. కొత్తగా తల్లి అయిన వారికి పరిమిత పని గంటలు ఉండాలని చెప్పిన ఆమె.. బిడ్డకు జన్మనిచ్చిన మహిళలు కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలి, అలాగే వారికి బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి అని తెలిపారు. అలాంటి వారికి అనువైన పని గంటలు ఉండడం చాలా ముఖ్యం. వారితో పోలిస్తే నాలాంటి వారికి బాధ్యతలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువ సమయాన్ని షూటింగ్‌లకు కేటాయించగలం అని చెప్పింది.
అంతేకాదు తాను 12 గంటలైనా చిత్రీకరణలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపింది. అంటే దీపిక పడుకొణెకు విద్యా బాలన్ బాసగా నిలిచినట్టే. మరి గత కొన్ని రోజులుగా దీపికను ట్రోల్ చేస్తున్న కొంతమంది ఇప్పుడు విద్యా బాలన్‌ను కూడా ట్రోల్ చేస్తారా? ఏమో చూడాలి.