ఆనాటి రోజులను గుర్తుకు తెచ్చుకున్న విజయ్!

విజేతగా నిలవడమనేది గొప్ప ఫీలింగ్. ప్రత్యర్ధులు మరింత గట్టి వారైతే.. మనకి స్ఫూర్తినిచ్చిన వారైతే.. వారిని దాటుకుంటూ ముందు స్థానంలో నిలిస్తే… ఆ అనుభూతి మాటల్లో వర్ణించలేనిది. నిన్న రాత్రి ఇదే అనుభూతిని ఆస్వాదించారు విజయ్ దేవరకొండ. అర్జున్‌రెడ్డి చిత్రంతో ఉత్తమనటుడిగా తొలి ఫిలింఫేర్‌ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఓ ఆంగ్ల మీడియాకు విజయ్‌ ఇచ్చిన ఇంటర్వ్యూలో తొలి ఫిలింఫేర్‌ అవార్డు అందుకోవడం ఎలా అనిపించిందో వెల్లడించారు. ” ఫిలింఫేర్‌ అవార్డ్స్ కి చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్‌ లాంటి స్టార్లతో పాటు నా పేరు నామినేట్‌ అయ్యింది. చిన్నప్పుడు నేను నాన్నతో కలిసి చిరంజీవి సినిమా చూడ్డానికి వెళ్లాను. సినిమా హాల్‌ నుంచి బయటికి వెళ్లి స్నాక్స్‌ తెచ్చుకోవాలంటే భయపడేవాడిని. అలాంటిది ఇప్పుడు ఇంతమంది ముందు అవార్డు అందుకోవడం నాకే షాకింగ్‌గా ఉంది.” అని వివరించారు. తాను ఇంతవరకు రావడం వెనుక ఎన్ని కన్నీటి రాత్రులు గడిపినట్లు పేర్కొన్నారు.

“నేను హీరో అవ్వాలనుకున్నప్పుడు.. అది జరగని పని అనిపించేది. ఆ ఫీలింగ్‌ చాలా బాధకలిగించేది. ఇది ఎప్పటికీ జరిగేది కాదు.. గాల్లో మేడలు కట్టకూడదు అనుకునేవాడిని. నటన వైపు వెళ్లద్దని అనుకున్న రోజులూ ఉన్నాయి. అదే సమయంలో ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాలో అవకాశం వచ్చింది. ఈ సినిమాతో నా కెరీర్‌కు మంచి బ్రేక్‌ వస్తుందని అనుకున్నా. కానీ ఈ సినిమా విడుదలైన ఏడాది తర్వాత కూడా నాకు అవకాశాలు లేవు. దాని వల్ల ఎంతో బాధ పడ్డాను. అని విజయ్ తెలిపారు. ఇంకా మాట్లాడుతూ “ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రంలో బాగానే చేశాను కదా.. ఎందుకు అవకాశాలు రావడం లేదు? అని నన్ను నేను ప్రశ్నించుకునేవాడిని. దాంతో ఆ సినిమా నిర్మాతలకు ఫోన్‌ చేసి సాయం చేయమని అడిగాను. అప్పుడే ‘పెళ్లి చూపులు’లో అవకాశం వచ్చింది. అక్కడి నుంచి జీవితం మారిపోయింది” అని గతాన్ని గుర్తుకుతెచ్చుకున్నారు. అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ వరుసగా ఐదు సినిమాలకు సైన్ చేశారు. అందులో ట్యాక్సీ వాలా ముందుగా థియేటర్లోకి రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus