విజయ్ దేవరకొండ గత కొన్ని నెలలుగా ఎక్కడకు వచ్చినా.. అరగుండు లుక్‌లోనే కనిపించాడు. ‘కింగ్డమ్’ సినిమాలో లుక్ అది. ఆ సినిమా గత కొన్నేళ్లుగా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. వివిధ కారణాల వల్ల చిత్రీకరణ ఆలసమైంది. అలాగే రీషూట్లు కూడా సినిమాను ఆలస్యం చేశాయి. అందుకే విజయ్ ఏ ఈవెంట్‌కి వచ్చినా, ప్రెస్‌మీట్లకు వచ్చినా ఇదే పరిస్థితి. సినిమాలో ఆ లుక్‌కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో తెలియదు కానీ బయట అయితే మంచి టాక్ వచ్చింది. అయితే చూసీ చూసీ విజయ్ ఈ లుక్ మారిస్తే బాగుండు అని కూడా అనిపించింది.
కొత్త సినిమా మొదలుపెడితే బాగుండు లుక్ మారుతుంది కదా అని కూడా అనుకున్నారు. ఇప్పుడు ఎట్టకేలకు విజయ్ కొత్త లుక్‌లోకి మారిపోయాడు. ‘కింగ్డమ్’ సినిమా ప్రచారం కోసం విజయ్ ఇంటర్వ్యూలు ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. అలా ఓ ఇంటర్వ్యూకి రెడీ అయిన ఫొటోలను విజయ్ షేర్ చేశాడు. అందులో పొడవాటి మీసాలు, గుబురు జుట్టుతో భలేగా ఉన్నాడు. దీంతో ‘మీసాల రాయుడు’ అని అభిమానులు ముద్దుగా కామెంట్లు చేస్తున్నారు. విజయ్ లుక్ కొత్త సినిమా ‘రౌడీ జనార్దన్’ కోసమే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
విజయ్ – రవికిరణ్ కోలా కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రం ‘రౌడీ జనార్దన్’. ఈ సినిమాలో కథానాయికగా కీర్తి సురేశ్ నటిస్తోందని సమాచారం. త్వరలోనే ఈ విషయం వెల్లడిస్తారు. ఈ సినిమా కోసం విజయ్ ఈ కొత్త లుక్‌లోకి మారిపోయాడు అని చెప్పాలి. ఈ సినిమా రాయలసీమ నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాతోపాటు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు.
‘కింగ్డమ్’ సినిమా విషయానికి వస్తే ఈ నెల 31న విడుదల కానుంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న రెండు పార్టుల ‘కింగ్డమ్’లో ఇప్పుడు వస్తోంది తొలి పార్టు. రెండో పార్టు గురించి టీమ్ అయితే ఎక్కడా ఏమీ మాట్లాడటం లేదు. ఫలితం బట్టి మాట్లాడతారేమో.