మక్కల్ సెల్వన్, విలక్షణ నటుడు అంటూ విజయ్ సేతుపతిని (Vijay Sethupathi) తెగ పొగిడేస్తుంటారు. ఇదంతా యన చేసిన 49 సినిమాలు చూసే. అదే ఆయన విన్న కథలు అన్నీ చేసుకుంటే, కనీసం అందులో సగమైనా చేసుంటే ఇంకా ఏమంటారు? ఏంటీ.. ఆయన అన్ని కథలు విన్నారా, అన్ని కథలు ఓకే చేయలేదా అంటారా? దీనికి సమాధానం యస్ అనే వస్తుంది. ఎందుకంటే ఆ మాటలు ఆయనే చెప్పారు కాబట్టి. ఒకటి కాదు రెండు కాదు తాను చేసిన సినిమాలు పదింతలు కథలు విన్నారట విజయ్ సేతుపతి.
పాత్రలో నటించడమే కాదు, జీవించడం ఎలాగో తెలిసిన నటుడు విజయ్ సేతుపతి. ఒకవైపు హీరోగా నటిస్తూనే… మరోవైపు అగ్ర తారల సినిమాల్లో విలన్, కీలక పాత్రల్లో అలరిస్తూ వస్తున్నారు. అందుకే తెలుగు, తమిళ, హిందీ ఇలా ఎక్కడికెళ్లినా అదిరిపోయే ప్రదర్శన ఇస్తున్నారు. విజయ్ సేతుపతి కథానాయకుడిగా తెరకెక్కిన ‘మహారాజ’ సినిమా ఈ నెల 14న తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా విజయ్ సేతుపతి మీడియాతో మాట్లాడాడు.
నేను నటించి, విడుదలైన సినిమాలు 50 కావొచ్చు. కానీ 500 కంటే ఎక్కువ కథలే నేను విన్నాను అంటూ తన కెరీర్ గురించి చెప్పారు విజయ్ సేతుపతి. తన జీవితంలో ఎంతో మందిని కలిశానని, ఎన్నో విజయాలు చూశానని, మరెన్నో పరాజయాలూ చూశానని చెప్పిన విజయ్ సేతుపతి.. అందువల్లే ఎంతో అనుభవాన్ని సంపాదించాను అని చెప్పుకొచ్చారు. అలాగే గతాన్ని మోసుకుంటూ ప్రయాణం చేయడం తనకు ఇష్టం ఉండదని కూడా చెప్పాడు.
ఇన్ని సినిమాలు చేశారు కదా.. మరి డైరక్షన్ ఎప్పుడు అని అడిగితే.. మంచి కథ కుదిరితే తప్పకుండా దర్శకత్వం చేస్తా అని క్లారిటీ ఇచ్చేశాడు. ఇప్పటికే ఓ మూడు సినిమాలకి కథ, స్క్రీన్‌ప్లే రాశానని చెప్పిన విజయ్… మరికొన్ని కథలూ రాసుకుంటున్నా అని చెప్పారు. కథానాయకుడిగా తమిళంలో మూడు సినిమాలు చేస్తున్నానని, హిందీలో ఓ సినిమా చేస్తున్నానని చెప్పాడు. మరి దర్శకుడు ఎప్పుడు అనేది చూడాలి.