సినిమాలకు ఏడాదిపాటు దూరంగా ఉంటా? అంటూ ఈ మధ్య సమంత అధికారికంగా ప్రకటించింది. దీంతో ఏమైంది, ఎందుకలా చెప్పింది అంటూ అభిమానులు ఆందోళన చెందారు. అయితే వైద్యం కోసం అలా చేస్తాను అంటూ ఆమె క్లారిటీ ఇచ్చేసింది. ఏడాదికే అలా అంటే.. ఓ స్టార్ హీరో ఇప్పుడు మూడేళ్ల పాటు విరామం తీసుకోవాలని అనుకుంటున్నాడట. ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్‌లో ఈ విషయం గురించే చర్చ. ఎందుకంటే ఆ యాక్టర్ కోలీవుడ్ స్టార్ కాబట్టే.
తమళనాట స్టార్ హీరో విజయ్‌కు ఉన్న క్రేజ్ మామూలుది కాదు. తెలుగులో కూడా మంచి ఇమేజ్ సంపాదించుకున్నారు. ఇటీవల ‘వారసుడు’గా వచ్చి ఆశించిన ఫలితాన్ని అందుకున్నారు. ఇప్పుడు లోకేశ్ కనగరాజ్‌తో ‘లియో’ సినిమా చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. అయితే త్వరలో విజయ్ మూడేళ్లపాటు సినిమాలకు దూరంగా ఉంటాడని చెబుతున్నారు. ఈ విషయంలో క్లారిటీ అయితే లేదు కానీ.. పుకార్లు మాత్రం బలంగా ఉన్నాయి.
‘లియో’ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 20న రిలీజ్ అవ్వబోతోంది. దాదాపు అన్ని భాషలను టార్గెట్ చేస్తూ విజయ్ ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. ఈ సినిమా తరువాత వెంకట్ ప్రభుతో ఓ సినిమా కమిట్ అయ్యాడు. ఆ సినిమా త్వరగా పూర్తి చేసి.. సినిమాలకు దాదాపు మూడేళ్లు గ్యాప్ తీసుకోవాలని అనుకుంటున్నాడట. తమిళనాట రాబోయే ఎన్నికలను టార్గెట్ చేసినట్టు సమాచారం.
విజయ్ (Vijay) రాజకీయ ఎంట్రీ పక్కా అని చాలా రోజుల నుండి పుకార్లు వస్తున్నా ఎక్కడా అందుకు తగ్గ సమాచారం లేదు. అయితే ఇప్పుడు ఎన్నికలు దగ్గరికొస్తున్నప్పుడు ఈ మేరకు నిర్ణయం తీసుకుంటాడు అంటున్నారు. వెంకట్ ప్రభు సినిమా 2024 ప్రారంభంలో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడట. ఆ తర్వాత రాజకీయాలకు సబంధించిన పనులు చూసుకుని.. మళ్లీ 2027లోనే సినిమాలు ప్లాన్ చేస్తున్నాడట. మరి నేరుగా రాజకీయాల్లో వస్తే.. ఎప్పుడు అనౌన్స్ చేస్తాడనేది చూడాలి.