Vikram Review: విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

తన టాలెంట్ తో ప్రేక్షకుల్ని, సినిమా ఇండస్ట్రీని విస్మయానికి గురిచేసిన దర్శకుడు లోకేష్ కనగరాజ్. విజయ్ తో తీసిన మాస్టర్ ఒక్కటి కాస్త బెడిసికొట్టినా.. “మహా నగరం, ఖైధీ” చిత్రాలను అతడు తెరకెక్కించిన విధానానికి విశేషమైన అభిమానులు ఉన్నారు. ఇక “విశ్వరూపం 2” తర్వాత మళ్ళీ తెలుగు ప్రేక్షకులకు కనిపించని కమల్ హాసన్ నాలుగేళ్ల తర్వాత “విక్రమ్”తో దర్శనమిచ్చారు. లోకేష్-కమల్ ల క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో సూర్య అతిధి పాత్ర పోషించడం విశేషం. మరి ఈ క్రేజీ ఫిలిమ్ ఎలా ఉందో చూద్దాం..!!

కథ: సిటీలో వరుస మర్డర్స్ జరుగుతుంటాయి. ఆ మర్డర్ వీడియోలను పోలీస్ డిపార్ట్మెంట్ కు పంపుతుంటుంది సదరు హత్య చేసిన బృందం. ఈ కేస్ ను చేధించడానికి నియమించిన స్పెషల్ ఆఫీసర్ అమర్ (ఫహాద్ ఫాజిల్). అమర్ మొదలుపెట్టిన ఇన్వెస్టిగేషన్ లో విక్రమ్ (కమల్ హాసన్) గురించి ఊహించని నిజాలు బయటపడతాయి.

అసలు ఎవరు ఈ విక్రమ్ ? సిటీలో జరుగుతున్న వరుస హత్యలకు విక్రమ్ కు సంబంధం ఏమిటి? అనేది “విక్రమ్” సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం.

నటీనటుల పనితీరు: నటుడిగా కమల్ హాసన్ ను జడ్జ్ చేయడం కానీ రేట్ చేయడం కానీ ఎవరి తరం కాదు. ఈ సినిమాలో ఆయన చూపే వేరియేషన్స్ & ఎమోషన్స్ ను కళ్ళార్పకుండా అలా చూస్తూ ఉండిపోతాం. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ లో కమల్ స్టైల్ హాలీవుడ్ సినిమాలను తలపిస్తుంది. భవిష్యత్ నటులకు.. మనవడికి పాలు కలిపే సీన్ లో కమల్ పెర్ఫార్మెన్స్ టెక్స్ట్ బుక్ రిఫరెన్స్ లాంటిది.

కమల్ స్క్రీన్ ప్రెజన్స్ & పెర్ఫార్మెన్స్ ముందు నిలదొక్కుకోవడమే పెద్ద కష్టం అనుకుంటే.. ఫహాద్ & విజయ్ సేతుపతి ఈ చిత్రంలో ఆయనకు పోటీ గా నటించి సినిమాకి ప్రత్యేక ఎస్సెట్ గా నిలిచారు.

ఇక చివరిలో “రోలెక్స్” క్యారెక్టర్లో సూర్య క్యామియో సినిమాకి మాంచి కిక్ యాడ్ చేయడమే కాదు.. “ఖైధీ 2 & విక్రమ్ 2″కి మంచి లీడ్ కూడా యాడ్ చేశాడు. ఆర్జీవీ & సుధ కొంగర తర్వాత సూర్య కళ్ళను సరిగా యూటిలైజ్ చేసిన దర్శకుడు లోకేష్ అని చెప్పొచ్చు.

సాంకేతికవర్గం పనితీరు: సినిమాటోగ్రాఫర్ గిరీష్ గంగాధరన్ వర్క్ “విక్రమ్”కి మెయిన్ ఎస్సెట్. లైటింగ్, టింట్ దగ్గర నుంచి ఫ్రేమింగ్ వరకూ ప్రతి విషయంలో సినిమాను వేరే లేవల్ కి తీసుకెళ్ళాడు. కమల్ హాసన్ ను ఇప్పటివరకూ చూడని విధంగా ప్రెజంట్ చేయడమే కాదు.. యాక్షన్ బ్లాక్స్ ను పిక్చరైజ్ చేసిన విధానం కూడా బాగుంది.

అనిరుధ్ ఎప్పట్లానే తన నేపధ్య సంగీతంతో సినిమాకి ఆయువుపట్టుగా నిలిచాడు. ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ బాగున్నాయి.

దర్శకుడు లోకేష్ కనగరాజ్ తన మీటర్ లో కమల్ మార్క్ మిస్సవ్వకుండా “విక్రమ్”ను చాలా బాగా తెరకెక్కించాడు. కమల్ హాసన్ క్యారెక్టర్ ను రాసుకొన్న విధానం, 1987 నాటి “విక్రమ్” సినిమాకు, తన మునుపటి చిత్రం “ఖైధీ”కి లింక్ చేసిన విధానం అదిరింది. “కె.జి.ఎఫ్” రేంఫ్ లో ఒక సినిమాటిక్ యూనివర్స్ ను క్రియేట్ చేశాడు లోకేష్. ఇక “విక్రమ్ 2 లేదా ఖైధీ 2” చిత్రానికి ఇచ్చిన ఎలివేషన్.. ఎప్పుడెప్పుడు కమల్, సూర్య, కార్తీలను ఒకే స్క్రీన్ పై చూస్తామా అని వెయిట్ చేసేలా చేశాడు. ముఖ్యంగా యాక్షన్ బ్లాక్స్, ఇంటర్వెల్ & క్లైమాక్స్ ను డిజైన్ చేసిన విధానం కమల్, ఫహాద్ & విజయ్ సేతుపతి ఫ్యాన్స్ ను మాత్రమే కాదు.. కమర్షియల్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటుంది.

దర్శకుడిగా లోకేష్ “విక్రమ్”తో 100% విజయం సాధించడమే కాక కమల్ కు చాన్నాళ్ల తర్వాత మంచి కమర్షియల్ హిట్ కూడా ఇచ్చాడు.

విశ్లేషణ: కమల్ హాసన్ అభిమానులు, లోకేష్ కనగరాజ్ టేకింగ్ ను ఇష్టపడే ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ ఇచ్చే చిత్రం “విక్రమ్”. తక్కువ హైప్ తో రిలీజ్ అవ్వడం సినిమాకి మరో ఎస్సెట్.

రేటింగ్: 3.5/5

Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus