వినయ విధేయ రామ

“రంగస్థలం” లాంటి ఇండస్ట్రీ హిట్ అనంతరం రామ్ చరణ్ నటించిన చిత్రం “వినయ విధేయ రామ”. మాస్ పల్స్ ఎరిగిన దర్శకుడు బోయపాటి తెరకెక్కించిన ఈ చిత్రం మీద మెగా అభిమానులు చాలా ఆశలు పెట్టుకొన్నారు. సంక్రాంతికి వస్తున్న ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని నమ్మకంగా ఉన్నారు. ఆ నమ్మకాన్ని బోయపాటి నిలబెట్టుకోగలిగాడా, మెగా అభిమానులను సంతుష్టపరచగలిగాడా? అనేది చూద్దాం..!!

కథ: ఈ సినిమాలో కథ అనేది ఉందని గ్రహించడానికి దాదాపు గంటన్నర పట్టింది. అది వేరే విషయం అనుకోండి. ఇక కథలోకి వెళ్తే.. భువన్ కుమార్ (ప్రశాంత్) ఎలక్షన్ కమిషనర్ ఇండియాలో ఎక్కడ ఎలక్షన్స్ జరగాలన్నా భువన్ కుమార్ ఉండాల్సిందే.. ఆఖరికి అవి బైఎలక్షన్స్ అయినా కూడా. అలా ఒకసారి ఎలక్షన్స్ ను ప్రశాంతంగా నిర్వహించడం కోసం బీహార్ వెళ్తాడు భువన్ అక్కడ ఎదురులేని శక్తిగా ఎదిగిన రాజా సింగ్ (వివేక్ ఒబెరాయ్)తో తలపడతాడు. అయితే.. రాజా సింగ్ గుంఢాగిరి ముందు భువన్ కుమార్ సిస్టమ్, ఆర్మీ నిలబడలేకపోవడంతో.. రంగంలోకి దూకుతాడు రామ్ కొణిదెల (రామ్ చరణ్). రామ్ రచ్చ ఎంట్రీతో బీహార్ ఎలక్షన్స్ పరిస్థితిలో ఎలాంటి మార్పులొచ్చాయి? ఆ మార్పుల కారణంగా రామ్ 7 ఫ్యామిలీ ఎదుర్కొన్న ఇబ్బందులేమిటి? అనేది డైరెక్టర్ బోయపాటి రాసుకొన్న కథ, ఆ కథను తెరపై ఒక 10 ఫైట్లు, మూడు తల నరికే సన్నివేశాలు, నాలుగు పాటలతో ఎలా తెరకెక్కించాడు అనేది తెరపై చూడండి.

నటీనటుల పనితీరు: దర్శకుడు బోయపాటి చరణ్ కి ఏం చెప్పాడో తెలియదు కానీ.. కథలో కంటే చరణ్ ఫేస్ లో కన్ఫ్యూజన్ ఎక్కువగా కనిపిస్తుంది. యాక్షన్ సీన్స్ లో పర్లేదు కానీ.. ఎమోషనల్ సీన్స్ లో మాత్రం తేలిపోయాడు. చరణ్ చొక్కా విప్పినంత మాత్రాన ప్రేక్షకులు నోరెళ్ళబెట్టి ఎక్స్ ప్రెషన్స్ ను పట్టించుకోవడం మానేస్తారని ఎలా అనుకున్నాడో బోయపాటి మరి. కామెడీ కూడా పెద్దగా పాడించలేకపోయాడు. ఒక్కమాటలో చెప్పాలంటే.. రంగస్థలంలో తన నటవిశ్వరూపం ప్రదర్శించిన చరణ్, వినయ విధేయ రామలో బోయపాటి చెప్పిన పని గుడ్డిగా చేసుకుంటూ పోయి తన అభిమానుల్ని తీవ్రస్థాయిలో నిరాశపరిచాడు.

కీయారాకి ఉన్నది తక్కువ సన్నివేశాలే అయినప్పటికీ.. స్క్రీన్ ప్రెజన్స్ & గ్లామర్ తో ఆకట్టుకుంది. కాకపోతే.. ఆమె ఇంట్రడక్షన్ సీన్ ను బోయపాటి డిజైన్ చేసిన విధానం మాత్రం బాగోలేదు. పైపెచ్చు వల్గర్ గానూ ఉంది.

ఇక జీన్స్ ఫేమ్ ప్రశాంత్ నటన మర్చిపోయాడా లేక నటించడం ఇష్టం లేదో తెలియదు కానీ.. సినిమా మొత్తంలో ఆయన కనీసం హావభావాల ప్రకటన కూడా సరిగా చేయకపోవడం దారుణం. ఆయన చనిపోయే సన్నివేశంలో “నొప్పిగా ఉందిరా” అని అంటుంటే ఆ నొప్పి ప్రేక్షకుల కళ్ళల్లో కనిపించింది కానీ ఆయన ముఖంలో మాత్రం బూతద్దం పెట్టి వెతికినా కనిపించలేదు.

స్నేహ, ఆర్యన్ రాజేష్, మధునందన్, రవివర్మ, చలపతిరావు వంటి వాళ్ళందరూ బ్యాగ్రౌండ్ ఆర్టిస్టుల్లా మిగిలిపోయారు. వివేక్ ఒబెరాయ్ ను అత్యంత శక్తివంతుడిగా చూపించిన విధానం బాగుంది, వివేక్ కూడా విలనిజాన్ని అద్భుతంగా పండించాడు. బహుశా సినిమా మొత్తంలో కాస్త మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది వివేక్ అనే చెప్పొచ్చు. కానీ.. ఆయన పాత్రను అటు తిప్పి ఇటు తిప్పి ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేశాడు బోయపాటి.

సాంకేతికవర్గం పనితీరు: బోయపాటి సినిమా లాజిక్స్ వెతకడం అనేది ఎప్పుడో మానేశారు ప్రేక్షకులు. కనీసం కథ వెతుక్కుందామని వస్తే సింపుల్ గా చితక్కొట్టేశాడు. ఒక సీను, ఒక ఫైటు, ఒక కామెడీ సీను, కాస్తంత సెంటిమెంటు అంటూ సినిమాని అల్లుకుపోయాడు తప్పితే కథ, కథనం అనేది అస్సలు పట్టించుకోలేదు. ట్రైన్ మీద నిల్చోని బీహార్ వచ్చేయడం ఏమిటో, తలలు నరికితే వాటిని గ్రద్ధలు క్యాచ్ పట్టడం ఏమిటో, విలన్ ని పాము కరిచి.. అదే గిలగిల కొట్టుకొని చనిపోవడం ఏమిటో. ఇలాంటి సన్నివేశాలు సినిమాలో చాలా ఉన్నాయి. ఎలివేషన్స్ బాగా తీస్తాను అనే నమ్మకంతో కథ రాసుకోకుండా సినిమా మొదలెట్టేశారేమోనని అనిపిస్తుంటుంది. లాజిక్, మ్యాజిక్ అవసరం లేదు సరే.. కనీసం కామన్ సెన్స్ కూడా లేకుండా ఈమధ్యకాలంలో వచ్చిన, బోయపాటి తీసిన సినిమా కూడా “వినయ విధేయ రామ”.

ఆయన తీసిన “దమ్ము” సినిమాలో కనీసం కొన్ని సన్నివేశాలైనా బాగుంటాయి. అలాంటిది “వినయ విధేయ రామ” మొత్తంలో ఒక్కటంటే ఒక్క ఆకట్టుకోగల అంశం లేదు. బోయపాటి చెప్పిన కథ, సన్నివేశాలు దేవిశ్రీప్రసాద్ కి పెద్దగా నచ్చలేదేమో సాంగ్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో పెద్దగా కేర్ తీసుకోలేదు. రిషి పంజాబీ, ఆర్ధర్ ఏ.విల్సన్ లు మాత్రం కాస్త గట్టిగానే కష్టపడ్డారనిపిస్తుంది. ఆ యాక్షన్ సీన్స్ అలాంటివి.

ఇక నిర్మాత దానయ్య బడ్జెట్ మొత్తం ఫైట్ సీన్స్ కే పెట్టేశాడేమో అనిపిస్తుంది. తెర నిండా నటీనటులున్నప్పటికీ.. రిపీటెడ్ లొకేషన్స్ ఎక్కువగా కనిపించడం, ఒకే సెట్ లో నాలుగైదు సన్నివేశాలు తెరకెక్కించడంతో సినిమా చూస్తున్నప్పుడు నిర్మాణ విలువలు చాలా చీప్ గా ఉన్నాయి అనిపిస్తుంది. ఇక ఎడిటర్ పనితనం గురించి మాట్లాడుకోవడం కంటే.. ఆయన ఓపికకు జోహార్లు చెప్పడమే బెటర్.

విశ్లేషణ: రంగస్థలంతో కాలర్ ఎగరేసిన మెగా అభిమానులు తల దించుకొనేలా చేసిన సినిమా “వినయ విధేయ రామ”. ఇది ఒక దర్శకుడి పరాజయం మాత్రమే కాదు.. యావత్ యూనిట్ బాధ్యత వహించాల్సిన ఫ్లాప్. ఇలాంటి కథకు ఒకే చెప్పిన చరణ్, సినిమాను ఇలా తీసిన బోయపాటి, కేవలం కాంబినేషన్ కోసం డబ్బులు ఖర్చు పెట్టిన నిర్మాత.. ఇలా అందరూ కలిసి సంక్రాంతికి ప్రేక్షకులకు అందించిన డిజాస్టర్ సినిమా “వినయ విధేయ రామ”.

రేటింగ్: 1/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus