“లేడీ పవర్ స్టార్” అనే సరికొత్త టైటిల్ సంపాదించుకున్న నేచురల్ ఆర్టిస్ట్ సాయిపల్లవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం “విరాటపర్వం”. రాణా కీలకపాత్ర పోషించిన ఈ చిత్రం షూటింగ్ 2019లో మొదలై.. రాణా అనారోగ్యం మరియు కోవిడ్ కారణంగా షూటింగ్ లేట్ అవుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు నేడు (జూన్ 17) విడుదలయ్యింది. పోయేటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం పాటలు, ట్రైలర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. మరి సినిమా ఏ స్థాయిలో ఉంటుందో చూద్దాం..!!
కథ: పోలీస్ మరియు నక్సల్ దళం నడుమ జరుగుతున్న ఓ హోరాహోరీ పోరు నడుమ జన్మించిన అమ్మాయి వెన్నెల (సాయిపల్లవి). నక్సల్ రవన్న (రాణా) రాసిన కవితలు, పుస్తకాలు చదువుతూ పెరుగుతుంది. తొలుత అతడి సాహిత్యాన్ని, తర్వాత అతడి క్యారెక్టర్ ను.. మెల్లమెల్లగా అతడ్ని ప్రేమించడం మొదలెడుతుంది.
మనిషికి మనిషిగా విలువ లేని సమాజంలో.. ప్రేమను గెలిపించుకోవడం కోసం వెన్నెల పడిన తాపత్రయమే “విరాటపర్వం”.
నటీనటుల పనితీరు: రాణా చెప్పినట్లు ఇది సాయిపల్లవి సినిమా. సినిమా మొత్తం ఆమే కనిపిస్తుంది. వెన్నెల అనే తెలంగాణ యువతి పాత్రలో సాయిపల్లవిని తప్ప మరెవరినీ కనీసం ఊహించుకోలేం. బాడీ లాంగ్వేజ్ నుంచి డైలాగ్ డెలివరీ వరకూ ప్రతి విషయంలో ఆమె చూపిన వైవిధ్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆమె కళ్ళల్లో కనిపించే నిజాయితీ, ఆమె మాటలో వినిపించే భావోద్వేగం ప్రేక్షకుడ్ని సినిమాలో మాత్రమే కాదు.. ఆమె పాత్రలో లీనం చేస్తాయి.
ఇలాంటి క్యారెక్టర్ ఒప్పుకున్నందుకు రాణాను అభినందించాల్సిందే. ఇంతటి తక్కువ స్క్రీన్ ప్రెజన్స్ ఉన్న హీరో క్యారెక్టర్ ప్లే చేయడానికి మరో హీరో అయితే అంగీకరించేవాడు కాదు. రవన్న పాత్రలోని ధైర్యం-తెగింపు రాణా పాత్ర వ్యవహార శైలిలో తొణికిసలాడతాయి.
నందితాదాస్, ఈశ్వరిరావు, జారీనా వహాబ్, ప్రియమణిల పాత్రలు సినిమాకి మరింత బలం చేకూర్చాయి. తండ్రి పాత్రలో సాయిచంద్ మరో మంచి పెర్ఫార్మెన్స్ తో అలరించాడు.
సాంకేతికవర్గం పనితీరు: తాను నమ్మిన కథను, రాసుకున్న కథనాన్ని ఎలాంటి కమర్షియల్ అంశాలను జోడించకుండా.. అనవసరమైన కామెడీ ఎపిసోడ్లు యాడ్ చేయకుండా నిజాయితీగా సినిమాను నడిపించాడు దర్శకుడు వేణు ఉడుగుల. అతడు రాసిన ప్రతి డైలాగ్ ఓ తూటాలా పేలింది. ముఖ్యంగా.. ప్రేమను మించిన విప్లవం లేదని వివరించే సంభాషణలు, సందర్బాన్ని వేణు ఉడుగుల కంపోజ్ చేసిన విధానం అద్భుతంగా ఉంది. అయితే.. కథనంలోకి ప్రేక్షకుడ్ని తీసుకెళ్లడానికి కాస్త ఎక్కువ సమయం తీసుకున్నాడు దర్శకుడు.
సాయిపల్లవి తర్వాత సినిమాకి మెయిన్ ఎస్సెట్ సురేష్ బొబ్బిలి. పాటలు, నేపధ్య సంగీతంతో సినిమాని మరో స్థాయికి తీసుకెళ్ళాడు. ముఖ్యంగా నేపధ్య సంగీతంతో సినిమాలోని ఎమోషన్ ను పతాక స్థాయిలో ఎలివేట్ చేశాడు సురేష్ బొబ్బిలి. ప్రొడక్షన్ & ఆర్ట్ డిజైన్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది.
విశ్లేషణ: ప్రేమకు మించిన విప్లవం లేదని చాటిచెప్పిన చక్కని చిత్రం “విరాటపర్వం”. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా, వైవిధ్యంగా తెరకెక్కించిన చిత్రమిది. సాయిపల్లవి నటన, సురేష్ బొబ్బిలి సంగీతం, వేణు ఉడుగుల సంభాషణలు-టేకింగ్ కోసం ఈ సినిమాను కచ్చితంగా ఒకసారి చూడాలి.
రేటింగ్: 3/5