టాలీవుడ్ ఇండస్ట్రీలో మార్కెట్ బార్డర్స్ ఇప్పుడు చాలా మంది లెక్క చేయడం లేదు. కాన్సెప్ట్ బావుంటే జనాలు తప్పకుండా థియేటర్స్ కు వస్తారని ఒక నమ్మకంతో వెళుతున్నారు. అయితే అందులో కొన్ని సినిమాలే మార్కెట్ వద్ద క్లిక్కవుతున్నాయి. ఇక మంచు వారి పెద్దోడు విష్ణు ఎలాంటి నమ్మకంతో నిర్మించాడో ఏమో గాని మోసగాళ్ళు సినిమాకు బడ్జెట్ గట్టిగానే పెట్టారట. ముందు నుంచి కూడా ఈ సినిమా బడ్జెట్ పై అనేక రకాల కథనాలు వచ్చాయి.
ఇక ఇప్పుడు డైరెక్ట్ గా మంచు విష్ణు బడ్జెట్ పై ఒక క్లారిటీ ఇచ్చాడు. గురువారం ట్రైలర్ ను లాంచ్ చేస్తూ సినిమా విశేషాల గురించి మాట్లాడారు. ఈ సినిమాను చాలా వరకు హాలీవుడ్ టెక్నీషియన్స్ తో తెరకెక్కించినట్లు చెబుతూ బడ్జెట్ రిస్క్ అని తెలిసినా కూడా కాన్సెప్ట్ మీద నమ్మకంతో ముందుకు వెళ్లినట్లు చెప్పారు. సినిమా కాన్సెప్ట్ రెడీ అయినప్పుడు బడ్జెట్ నా మార్కెట్ కంటే 30% ఎక్కువ అవుతుందని అర్ధమయ్యింది.
నా కెరీర్ లో ఇదే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ. అంత మార్కెట్ నాకు లేదని తెలుసు. అలాగే రిస్క్ అని కూడా అనుకున్నాను. అయితే మోసగాళ్ళు ఆ మార్కెట్ పరిధిని పెంచుతుందని అనుకుంటున్నాను. అసలైతే ఈ సినిమాను గత ఏడాది జూన్ లో రిలీజ్ చేయాల్సింది. కరోనా లాక్ డౌన్ వల్ల వాయిదా వేయక తప్పలేదని మంచు విష్ణు వివరణ ఇచ్చారు.