అక్టోబరు 31న బాక్సాఫీసు దగ్గర త్రిముఖ పోటీ ఉంటుంది అని అనుకున్నారంతా. రెండు సినిమాల రిలీజ్‌లు ఉంటే.. ఒక రీరిలీజ్ లాంటి రిలీజ్ ఒకటి ఉంది. దీంతో మంచి మజా వస్తుంది అనుకున్నారంతా. కానీ ఒకరి మీద ఒకరు ప్రేమ చూపించుకోవడంతో వాయిదాల పర్వం మొదలైంది. తొలుత రవితేజ తన అభిమానాన్ని చూపించగా.. ఇప్పుడు విష్ణు విశాల్ తన ప్రేమను చూపించారు. దీంతో ఆయన కొత్త సినిమా కూడా వాయిదా పడింది. ఈ ప్రేమాభిమానాల కథేంటో చూద్దాం.
విష్ణు విశాల్ పోలీసు అధికారిగా నటించిన కొత్త చిత్రం ‘ఆర్యన్’. ఈ సినిమాను అక్టోబరు 31న విడుదల చేస్తామని ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఈ మేరకు ప్రచారం కూడా చేసుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను వాయిదా వేస్తున్నట్టు విశాల్ ప్రకటించారు. నవంబరు 7న సినిమాను రిలీజ్ చేయనున్నట్టు పేర్కొన్నారు. దీనికి కారణం అదే తేదీన రిలీజ్ కానున్న రెండు సినిమాల దారిచ్చేయాలనే ఆలోచన రావడమే.

ఈ నెల 31న ‘మాస్ జాతర’, ‘బాహుబలి: ది ఎపిక్’ సినిమాలు విడుదల కాబోతున్న నేపథ్యంలో తమ సినిమా ‘ఆర్యన్’ను వాయిదా వేయాలనే నిర్ణయం తీసుకున్నానంటూ ఓ నోట్ విడుదల చేశారు. సినిమా అనేది రేస్ కాదు. ఒక వేడుక. మా సినిమా ‘ఆర్యన్’ ఈ నెల 31న విడుదల కావాల్సి ఉంది. రవితేజ ‘మాస్ జాతర’, ‘బాహుబలి: ది ఎపిక్’ రాకతో ఆ తేదీ ప్రత్యేకంగా మారింది. నేను రవితేజను అభిమానించే వ్యక్తిని. ఆయన మద్దతు నాకుంది. ఇప్పుడు నేను కూడా ఆయన కోసం వాయిదా వేస్తున్నాను అని చెప్పాడు.

దర్శకుడు రాజమౌళికి వీరాభిమానిని. అందుకే ఈ వారం వారిద్దరి సినిమాలను సెలబ్రేట్ చేసుకోవడం సరైందని భావిస్తున్నాను. అందుకే నా సినిమాను వాయిదా వేస్తున్నాను. నా నిర్ణయాన్ని అంగీకరించిన మా డిస్ట్రిబ్యూటర్లు సుధాకర్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డికి కృతజ్ఞతలు అని చెప్పారు. బాగుంది కదా ఈ అభిమానం.
