ఒకేసారి నాలుగైదు సినిమా సెట్స్ మీద ఉంచడం, కనీసం లైనప్‌లో పెట్టుకోవడం చాలా అవసరం. కొత్త హీరోలకు, సరైన బ్యాకప్ లేని హీరోలకు అయితే ఇంకా అవసరం. ఇప్పుడు విశ్వక్‌సేన్ (Vishwak Sen) అదే పనిలో ఉన్నాడు. కావాలంటే మీరే చూడండి ఇప్పుడు విశ్వక్ చేతిలో మొత్తంగా ఐదు సినిమాలు ఉన్నాయి అంటున్నారు. ఇటీవల ప్రారంభించిన పోలీసు కథతో ఐదు సినిమాలు అయ్యాయట. ఓ సినిమాకు గుమ్మడికాయ కొట్టడం ఆలస్యం, మరో సినిమాకు కొబ్బరికాయ కొడుతున్నాడు విశ్వక్‌సేన్.
అలా స్వాతంత్ర్య దినోత్సవం నాడు మరో సినిమా మొదలుపెట్టాడు. సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) నిర్మాతగా శ్రీధర్ గంటాను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ సినిమా స్టార్ట్ చేశాడు విశ్వక్. ఈ సినిమా ఓపెనింగ్ సెర్మనీ ఘనంగా జరిగింది. విశ్వక్ ఈ సినిమాలో పోలీసాఫీసరుగా కనిపించబోతున్నాడు. కన్నడ చిత్ర సీమకు చెందిన సంపద అనే అమ్మాయిని హీరోయిన్‌గా తీసుకున్నారు. ‘కాంతార’ సినిమా ఫేమ్ అజనీష్ సంగీత దర్శకత్వం వహించనున్నారు.
గతంలోనూ విశ్వక్ పోలీసుగా ఓ సినిమా చేసి మంచి విజయం అందుకున్నాడు. అయితే అది ‘హిట్’ (HIT) పోలీసు. మరి ఈసారి పూర్తి స్థాయి పోలీసుగా విశ్వక్ ఎలాంటి విజయం అందుకుంటాడో చూడాలి. ఇక ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs of Godavari) సినిమాతో కొన్ని రోజుల క్రితం థియేటర్లలోకి వచ్చాడు విశ్వక్‌సేన్. ఇక దీపావళికి ‘మెకానిక్ రాకీ’ (Mechanic Rocky) తో రాబోతున్నాడు. ప్రచార చిత్రాలతో ఈ సినిమా మీద అంచనాలు పెంచుతున్నాడు.
లేడీ గెటప్‌లో నటిస్తున్న ‘లైలా’ సినిమా సెట్స్ మీద ఉంది. ఇది కాకుండా ‘జాతి రత్నాలు’ (Jathi Ratnalu) ఫేమ్ అనుదీప్ కేవీ (Anudeep Kv) దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇవన్నీ కాకుండా తన ట్రేడ్ మార్క్ ప్రొడక్ట్ ‘దాస్ కా ధమ్కీ’కి మరో పార్టు తీయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇతర దర్శకుల సినిమాలు అయిన తర్వాత తన సినిమా స్టార్ట్ చేస్తాడట. తన ‘ఫలక్‌నుమా దాస్’ (Falaknuma Das) , ‘దాస్ కా ధమ్కీ’ (Das Ka Dhamki) మంచి విజయాలు సాధించిన విషయం తెలిసిందే.