Vishwak Sen: వారు పైరసీ కంటే ప్రమాదకరం: విష్వక్‌ సేన్‌ ఫైర్‌

తన సినిమాల గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడినా, ఇబ్బందికరమైన పని చేసినా ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు యువ కథానాయకుడు విశ్వక్‌సేన్‌ (Vishwak Sen). ఈ క్రమంలో చాలాసార్లు ఆయనపై విమర్శలు కూడా వచ్చాయి. ఏదో కావాలనే ప్రచారం కోసం ఇలాంటి మాటలు అంటుంటారు అనే మాటలు కూడా పడ్డాడు. అయితే ఇప్పుడు విశ్వక్‌.. ఇండస్ట్రీకి ఇబ్బందికరంగా మారిన ఓ విషయం గురించి మాట్లాడాడు. ‘ఇలాంటి వారు పైరసీ కంటే ప్రమాదకరం’ అంటూ ఫైర్‌ అయ్యారు.

ఇటీవల ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD)   సినిమా ట్రైలర్‌ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ ట్రైలర్‌పై యూట్యూబ్‌లో చాలామంది రివ్యూలు చేశారు. ఓ యూట్యూబర్‌ ఇలానే సినిమా ట్రైలర్‌ను, మరో సినిమాలోని అంశాలతో పోలుస్తూ రివ్యూ ఇచ్చాడు. కథ కొత్తగా ఉన్నా, కొన్ని అంశాల్లో హాలీవుడ్‌ చిత్రాల పోలికలు ఉన్నాయంటూ ట్రైలర్‌పై సమీక్ష చేశాడు. దానికి సంబంధించిన వీడియోను విశ్వక్‌సేన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ కొన్ని కామెంట్లు చేశాడు. సినిమా విడుదల అవ్వకముందే ఇలా యూట్యూబ్‌లో రివ్యూలు ఇస్తున్నారు.

ఇండస్ట్రీపై వేలాది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. అలాంటి పరిశ్రమ అంటే యూట్యూబర్లకు సరదా అయిపోయింది. సినిమాలపై అభిప్రాయాలు వ్యక్తం చేసే ఇలాంటివారు ఏదైనా షార్ట్‌ ఫిలిమ్‌ తీసి చూపించండి అంటూ ప్రశ్నించాడు. ఇకనైనా సినిమా కార్మికుల కష్టాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా అని కూడా అన్నాడు విశ్వక్‌. అలాగే ఆ రివ్యూ చేసిన యూట్యూబర్‌ను ‘నువ్వు షార్ట్‌ఫిల్మ్‌ తీసి చూపించు.. అప్పుడు నీ అభిప్రాయానికి గౌరవం ఉంటుంది’ అని సవాలు కూడా విసిరాడు.

ఈ క్రమంలో విశ్వక్‌ చేసిన ‘చెంబు పట్టుకుని బయలుదేరుతున్నారు’ లాంటి మాటలు కాస్త ఇబ్బందికర రెస్పాన్స్‌ అందుకుంటున్నాయి నెటిజన్ల నుండి. సినిమా రాకుండానే ట్రైలర్‌లోని కంటెంట్‌ను విమర్శించడం తప్పు అని విశ్వక్‌ అంటున్నారు.. మరి ఆయన ఎలాంటి విమర్శలు చేస్తున్నారో చూడండి లాంటి విమర్శలు వస్తున్నాయి. మరి ఈ విషయంలో విశ్వక్‌ ఏమంటారో చూడాలి. ఇన్నాళ్లుగా సినిమా రివ్యూల మీద ఓ విధానం కోసం పోరాడిన సినిమా పెద్దలు.. విశ్వక్‌ కామెంట్స్‌ నేపథ్యంలో యూట్యూబర్ల మీద కూడా ఏమైనా కామెంట్‌ చేస్తారేమో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus