ఈ మధ్యనే ‘బిగ్ బాస్4’ మొదలైంది. ఇప్పుడిప్పుడే షో రసవత్తరంగా మారుతుంది. హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీలతో మరింత సందడి పెరుగుతుంది. ఈ వారం కుమార్ సాయి, ముక్కు అవినాష్ వంటి వారు వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చారు. రేపు హీరోయిన్ స్వాతి దీక్షిత్ కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. సరే ఈ విషయాల్ని పక్కనపెట్టేస్తే.. షోలో ఇప్పుడిప్పుడే సందడి వాతావరణం ఏర్పడుతోన్న తరుణంలో గత సీజన్లో పాల్గొన్న కంటెస్టెంట్ వితిక తాజాగా ‘బిగ్ బాస్’ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ‘బిగ్ బాస్3’ లో తన భర్త వరుణ్ సందేశ్ తో ఎంట్రీ ఇచ్చిన వితిక 10 వారాల పైనే హౌస్ లో కొనసాగిన సంగతి తెలిసిందే.
తాజాగా ‘స్పోక్స్ మై హార్ట్ ఔట్’ అనే పేరుతో ఓ వీడియోని సోషల్ మీడియాలో విడుదల చేసింది వితిక. ఆమె మాట్లాడుతా.. “బిగ్‌బాస్ సీజన్ తరువాత నేను ఎంతటి మానసిక క్షోభను ఎదుర్కున్నానో నాకు తెలుసు. ‘బిగ్ బాస్’ షోలో మంచి ఉంది.. అలాగే చెడు కూడా ఉంది. హౌస్లో 24 గంటలు గడిపే కంటెస్టెంట్ల జీవితాన్ని గంట మాత్రమే చూపించి క్యారెక్టర్‌లని డిసైడ్ చేస్తుంటారు. ఇందులో పాల్గొనే కంటెస్టెంట్లు చేసేది.. చూసే వాళ్లకు చాలా అతిగా అనిపిస్తోంది. అది నటన అని కూడా వారు అనుకుంటున్నారు. హౌస్ లో ఉన్నప్పుడు నా పై కూడా సోషల్ మీడియాలో చాలా నెగెటివ్ కామెంట్స్ వినిపించాయి.
అవి చూసిన నా ఫ్యామిలీ ఎంతో మానసిక క్షోభననుభవించింది. బయటకు వచ్చాక నేను కూడా చాలా బాధపడ్డాను. అలాంటి టైములో నా కుటుంబం నాకు అండగా నిలబడింది” అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా.. ‘నా 11 ఏళ్ల వయసలోనే సీరియల్స్‌లో నటించడం మొదలుపెట్టాను. ‘భీమిలి కబడ్డి జట్టు’, ‘ఝుమ్మంది నాదం’, ‘ప్రేమ ఇష్క్ కాదల్’ వంటి చిత్రాలు నాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. సో నేను కూడా చాలా కష్టపడితేనే ఈ స్థాయికి వచ్చాను’ అంటూ కూడా తన ఆవేదన వ్యక్తం చేసింది వితిక.