‘ఒక సినిమా హిట్టయితే అది.. ఆ క్రెడిట్ చిత్ర యూనిట్ అందరికీ చెందుతుంది. అదే ఓ సినిమా ఆ ప్లాప్ అయితే దానికి పూర్తి బాధ్యుడిని నేనే. ఎందుకంటే నేను ఓకే చేయకపోతే ఆ కథ తెరకెక్కదు. నా జడ్జిమెంట్ లోపం వలనే ఆ ప్లాప్ రూపొందుతుంది.. అందుకే ప్లాప్ కి బాధ్యత నాదే..’ ఇవి మహేష్ బాబు తన ప్లాప్ చిత్రాలకి ఇచ్చే సమాధానాలు. నిజానికి ఇది చాలా గొప్ప క్వాలిటీ. సక్సెస్ ను ఎవరైనా ఓన్ చేసుకుంటారు. కానీ ప్లాప్ కి కూడా నాదే పొరపాటు అని చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. ఓ సినిమా ప్లాపయితే ఆ డైరెక్టర్ వలెనే ప్లాప్ అయ్యింది.. లేదా ఆ హీరో వలనే ప్లాప్ అయ్యింది అని తప్పించుకునే హీరో, దర్శకులను మనం చాలా మందిని చూసాం. కానీ మహేష్ బాబు అలా కాదు. తప్పుని అంగీకరించి ముందుకు సాగే క్వాలిటీని కచ్చితంగా మెచ్చుకోవాలి. ఇప్పుడు మెగా మేనల్లుడు సాయి తేజ్ కూడా అచ్చం మహేష్ లానే మాట్లాడుతుండడం ఆశ్చర్యం కలిగించే విషయం.
వివరాల్లోకి వెళితే… సాయి తేజ్ 2016 లో వచ్చిన ‘సుప్రీమ్’ చిత్రం తర్వాత మళ్ళీ ‘చిత్రలహరి’ వచ్చే వరకూ హిట్టు మొహం చూడలేదు. మధ్యలో ఆరు ప్లాపులొచ్చాయి. ఈ ఆరు ప్లాపులిచ్చిన డైరెక్టర్లలో మాస్ డైరెక్టర్ వినాయక్ కూడా ఒకడు. తేజతో ‘ఇంటిలిజెంట్’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు వినాయక్. ఈ చిత్రం పెద్ద డిజాస్టర్ గా మిగిలింది. వినాయక్ తీసిన అన్ని చిత్రాల్లోనూ ఇదే చెత్త సినిమా అనే రేంజ్లో ఆడియన్స్ దేన్ని తిప్పికొట్టారు. అయితే ఈ చిత్రం ప్లాపయ్యాక వినాయక్ తేజుని కలిసి సారీ చెప్పారంట. ఈ విషయాన్ని స్వయంగా తేజునే తెలిపాడు. తేజు మాట్లాడుతూ.. “గత సినిమాల రిజల్ట్ ఏమిటనేది నేను పెద్దగా పట్టించుకోను. పొరపాట్లు ఎన్ని జరిగినా అది నా వల్లే జరిగి ఉంటుందని అనుకుంటున్నా. ఎందుకంటే కథను ఫైనల్ చేసేది నేనే కాబట్టి. అందుకు బాధ్యుడిని కూడా నేనే. తప్పు నాదే. ‘ఇంటిలిజెంట్’ అనంతరం వినాయక్ గారు నాకు సారి చెప్పారు. సక్సెస్ ఇవ్వలేకపోయినందుకు చాలా బాధపడ్డారు” అంటూ తేజు వివరణ ఇచ్చాడు. ఈ రకంగా అచ్చు గుద్దినట్టు మహేష్ నే తేజు ఫాలో అయినట్టు తెలుస్తుంది.