థియేటర్స్‌లో బంపర్ హిట్ కొట్టిన సినిమా.. ఓటీటీలోనూ అదరగొడుతుందా? ఏమో కచ్చితంగా చెప్పలేం అని అనొచ్చు. ఈ విషయంలో ఇంకా క్లియర్‌గా సమాధానం చెప్పాలంటే వైజయంతి మూవీస్ వాళ్లే కరెక్ట్. అంత పక్కాగా ఎలా చెప్పగలుగుతున్నాం అంటారా? కావాలంటే వాళ్ల రీసెంట్ సినిమాలు చూడండి ఈ విషయం మీకే అర్థమవుతుంది. లేదంటే ‘సీతారామం’ అని సోషల్ మీడియాలో సెర్చ్ చేసి చూడండి మీమ్స్ మీద మీమ్స్ మీకు కనిపిస్తాయి. స్థూలంగా విషయం చెప్పాలంటే..
ఓటీటీ యూజర్లకు ‘సీతారామం’ సినిమా నచ్చలేదు. ఈ మాట మేం అనడం లేదు. ఓటీటీయన్స్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ఘనంగా రాసుకొస్తున్నారు. థియేటర్స్‌లో సినిమా చూడని వాళ్లు ఓటీటీలో చూసి ఆనందిస్తారు అనుకుంటే.. ‘ఇదేంటి ఇలా ఉంది సినిమా?’ అనే సమాధానం వచ్చింది. నచ్చకపోవడానికి కారణాలేంటి అనేది పక్కనపెడితే.. ఓటీటీయన్స్ (ఓటీటీ చూసేవాళ్లు)కు మాత్రం ఈ సినిమా అంతగా ఎక్కలేదు అని తెలుస్తోంది. ఈ ఒక్క సినిమాను పట్టుకునే వైజయంతి వాళ్లకు ఓటీటీ అచ్చిరాలేదు అనుకోవడానికి లేదు.
అంతకుముందు ఇదే బ్యానర్ నుండి వచ్చిన ‘జాతిరత్నాలు’ సినిమాకు కూడా ఓటీటీ దగ్గర ఇలాంటి స్పందనే వచ్చింది. థియేటర్లలో పగలబడి జనాలు నవ్వితే.. ఓటీటీల్లో సోసోగా ఉంది సినిమా అనే మాట వచ్చింది. దీంతో వైజయంతి సినిమాలు ఓటీటీలకు ఎక్కడం లేదు అని అంటున్నారు కొంతమంది నెటిజన్లు. అయితే అలాంటి సినిమాలు థియేటర్లలో చూస్తేనే మజా అంటున్నారు థియేటర్స్ లవర్స్. ‘సీతారామం’ సినిమా విజువల్ గ్రాండియర్ మాత్రమే కాదు, ఓ ప్రేమ కావ్యం.
ఆ ఫీల్ థియేటర్లలో చూస్తనే వస్తుంది. ఇంట్లో ఉండి చూసేవాళ్లకు రాదు అంటున్నారు ఇంకొంతమంది సినిమా ప్రేమికుల్లాంటివాళ్లు. అయితే సినిమా ఫీల్ ఎక్కడున్నా ఒకలా ఉండదు కానీ.. ఇంట్లో కూర్చుంటే అసలు సినిమా ఫీలే తెలియదు అనుకోవడం తప్పు. ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘కేజీయఫ్’, ‘విక్రమ్’ లాంటివి ఇంట్లోనూ నచ్చాయి. థియేటర్లలోనూ నచ్చాయి. కాబట్టి చూసే ప్లేస్ సినిమా మీద అభిప్రాయాన్ని మార్చదు. ఎవరు చూస్తున్నారు అనేదే ఇక్కడ విషయం. అది థియేటర్ ప్రేక్షకుడా? లేక ఓటీటీయనా? అనేది విషయం.