చిత్ర పరిశ్రమలపై కరోనా ప్రభావం ఇప్పట్లో పోయేలా లేదు. ఒక వేళ షూటింగ్స్ మొదలైనా ఆంక్షల మధ్య అతి తక్కువ మానవ వనరులతో పూర్తి చేయాల్సిన పరిస్థితి. చిన్న బడ్జెట్ చిత్రాల వరకు ఇది ఒకే కానీ భారీ బడ్జెట్ తో తెరకెక్కే స్టార్ హీరోల సినిమాల షూటింగ్ కొద్దిమందితో పూర్తి చేయడం కుదరనిపని. కాగా అందుకే రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ విడుదల జనవరి నుండి సమ్మర్ కి వాయిదాపడింది అంటున్నారు. కాగా ఆర్ ఆర్ ఆర్ సంక్రాంతి బరి నుండి తప్పుకోవడంతో పాటు, లేటుగా విడుదల చేయడమే మంచిదని భావిస్తున్న స్టార్ హీరోలు సంక్రాతి పై ఫోకస్ పెట్టారని తెలుస్తుంది.
మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివతో చేస్తున్న ఆచార్య ఇప్పటికే 40శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ మూవీని దసరా లేదా దీపావళి కానుకగా విడుదల చేయాలన్నది మేకర్స్ ప్రణాళిక. ఐతే ఆచార్య టీం కూడా కొద్దిరోజులు ఆగి సంక్రాంతికి విడుదల చేయడం బెటర్ అనుకుంటున్నారట. అలాగే బాలయ్య బోయపాటితో ఓ మూవీ చేస్తుండగా, ఓ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకున్న ఈ మూవీ లాక్ డౌన్ అనంతరం షూట్ మొదలుకానుంది. సంక్రాంతి హీరోగా ఉన్న బాలయ్య 2021 సంక్రాంతికి బోయపాటి చిత్రంతో ఖచ్చితంగా వస్తాడు అనిపిస్తుంది. అలాగే మరో స్టార్ హీరో ప్రభాస్ దర్శకుడు రాధా కృష్ణ తో చేస్తున్న పీరియాడిక్ లవ్ డ్రామా 50శాతం వరకు షూట్ పూర్తి చేసుకుంది. ఈ మూవీ కూడా సంక్రాతి బరిలో దిగే అవకాశం కలదు.
కరోనా భయం జనాల్లో పోయేవరకు థియేటర్స్ వైవు చూసే పరిస్థితి లేదు. వీళ్ళ సినిమాల షూటింగ్స్ పూర్తి అయినా భారీ వసూళ్ల అవకాశం ఉండే సంక్రాంతికి రావడం బెటరని వీరు భావించే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి చిరు, బాలయ్య, ప్రభాస్ తమ లేటెస్ట్ చిత్రాలను సంక్రాంతి బరిలో దింపడం ఖాయం అంటున్నారు. మరి ఇదే కనుక జరిగితే ఈసారి సంక్రాంతి పోరు రసవత్తరంగా ఉండడం ఖాయం.