అన్నీ అనుకున్నట్లుగా సాగుంటే… ఈ పాటికి మనం ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘రాధేశ్యామ్’ సినిమాల గురించి, వసూళ్ల గురించి మాట్లాడుకునే వాళ్లం. కానీ కరోనా సీక్వెల్‌లా వచ్చి… మొత్తం లెక్కలు మార్చేసింది. దీంతో ఆ సినిమాల విడుదల ఆగిపోయింది. వాటిలో ఓ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది వచ్చేసింది. ఇప్పుడు మరో సినిమా రిలీజ్ డేట్ గురించి తెలియాల్సి ఉంది. అయితే ఆ సినిమా రిలీజ్ డేట్ గురించి లెక్క తేలడం అంత ఈజీగా అయ్యేలా లేదు.
సంక్రాంతి రేసు నుండి ‘ఆర్‌ఆర్ఆర్’, ‘‘రాధేశ్యామ్’ రిలీజ్‌లు వాయిదా పడ్డాక… కొత్త డేట్స్ ఎప్పుడా అని అందరూ వెయిట్ చేస్తున్నారు. ఈలోగా రెండు డేట్స్ ప్రకటిస్తూ షాక్ ఇచ్చింది ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్. పరిస్థితులు అనుకూలించి… థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకుంటే మార్చి 18న సినిమా విడుదల చేస్తామని ప్రకటించింది. లేదంటే ఏప్రిల్ 28న విడుదల చేస్తామని ప్రకటించింది. దీంతో ‘రాధేశ్యామ్’ పరిస్థితి అడకత్తెరలో పోక చెక్క అయిపోయింది అంటున్నారు టాలీవుడ్ పరిశీలకులు.
రిలీజ్ డేట్లు అఫీషియల్‌గా చెప్పకపోయినా… మార్చి 18న ‘రాధేశ్యామ్’ విడుదల చేయాలని టీమ్ అనుకుంటోందని వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు ఆ డేట్‌ను ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్ అనౌన్స్ చేసింది. కాబట్టి ప్రభాస్ సినిమా వేరే రోజును వెతుక్కోవాలి. అయితే ఇది అంత ఈజీగా అయ్యేలా కనిపించడం లేదు. ఎందుకంటే వేసవిలో పెద్ద సినిమాలు చాలా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు వాళ్లంతా వెనక్కి తగ్గి ‘రాధేశ్యామ్’ దారిస్తారా అనేది చూడాలి. మొన్న సంక్రాంతికి ఇలానే త్యాగాలు చేశారు, కానీ అనుకున్నట్లుగా సాగలేదు.
అయితే ఈ త్యాగాల కాన్సెప్ట్ ‘ఆర్‌ఆర్‌ఆర్’కి కూడా వర్తిస్తుంది అనుకోండి. కాబట్టి అన్ని సినిమాల మధ్య సాధారణ సినిమాలా రావాల్సిందే. మార్చి కల్లా కరోనా పరిస్థితులు సద్దుమణిగిపోతే… ‘ఆర్‌ఆర్‌ఆర్’కి వారం ముందు కానీ, వారం తర్వాత కానీ ‘రాధేశ్యామ్’ వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారని టాక్. ‘ఆర్‌ఆర్‌ఆర్’ మార్చిలో వచ్చినా, ఏప్రిల్‌లో వచ్చినా దానికి దగ్గర్లోనే ‘రాధేశ్యామ్’ను తీసుకొస్తారనేది పక్కా. మరి యూవీ క్రియేషన్స్ ఆలోచనలు ఎలా ఉన్నాయో చూడాలి. ఒకటి రెండ్రోజుల్లో రిలీజ్ డేట్ లేదా డేట్స్ అనౌన్స్ అయ్యే అవకాశం ఉంది.
Most Recommended Video
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!