రెండు నెలల క్రితం తమన్ వేరు.. ఇప్పుడు తమన్ వేరు. అవునా.. అదేంటి అనుకుంటున్నారా? ఇక్కడ వేరు అంటే.. ఆయన మారిపోయాడు అని కాదు. ఆయనకు వస్తున్న రెస్పాన్స్ మారిపోయింది అని. తమన్ సంగీతం అందించిన రెండు సినిమాలకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ బయటకు వచ్చింది. వాటికి వస్తున్న స్పందన చూశాక నెటిజన్లు ‘తమన్‌కి ఒక్కసారిగా ఏమైంది.. ఎనర్జీ మొత్తం ఆ సినిమాకే ఇచ్చేశారా?’ అని అంటున్నారు. ఆ సినిమా అంటే ఏంటో తెలుసు కదా.. ‘ఓజీ’.
గత కొన్నేళ్లుగా టాలీవుడ్‌లో తమన్ హవా నడుస్తోంది. ఆయన నుండి వరుస సినిమాలు వస్తున్నాయి. వచ్చిన పాటలు వచ్చినట్లు హిట్ టాక్‌తో చార్ట్ బస్టర్‌లు అవుతున్నాయి. మ్యూజిక్ ప్లాట్‌ఫామ్స్‌లో ట్రెండింగ్‌లో ఉంటున్నాయి. ఇక బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సంగతైతే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తమన్ వాయించారు అంటే.. తుక్కు రేగినట్లే అని అంటున్నారు. అయితే రీసెంట్‌గా వచ్చిన ‘అఖండ 2: తాండవం’, ‘ది రాజాసాబ్’ ప్రమోషనల్ కంటెంట్‌లో ఆ పరిస్థితి కనిపించడం లేదు.
‘అఖండ 2: తాండవం’ నుండి టీజర్, సాంగ్స్ వచ్చాయి. టైటిల్ సాంగ్ పాత హిట్ సాంగ్‌కి కంటిన్యూషన్‌లా ఉండటంతో ఆ టాక్ కంటిన్యూ అయిపోయింది. ఆ తర్వాత వచ్చిన ‘జాజికాయ’ సాంగ్‌కి ఆదరణ బాగున్నా.. ఇన్‌స్టంట్ హిట్ అనే ఫీల్ కలిగించలేదు. దానికి కారణం బీట్ అంత ఎనర్జిటిక్‌గా లేకపోవడమే. ఇక ‘రాజాసాబ్’ సినిమాలోని ‘రెబల్‌సాబ్’ పాట చూడటానికి కంటికి ఇంపుగా ఉన్నా వినడానికి వినసొంపుగా లేదు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
దీంతో ఆయా సినిమాల హీరోల ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. ‘ఓజీ’ సినిమాను మించిన సంగీతం అందిస్తారు అనుకుంటే.. ఇదేంటి ఇలా నిరాశపరిచారు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే తమన్‌ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. సినిమా విషయానికొచ్చేసరికి ఊహించని విధంగా అదరగొడతారు. గతంలో ఇదే పని చేశారు కూడా. మాస్ ఎలివేషన్లకు, అదిరిపోయే బ్యాగ్రౌండ్‌తో బాకీ తీర్చేస్తారు. చూద్దాం మరి.