“సినిమా చూశాను చాలా బాగుంది, ఈ తరంలో ఇలాంటి కథను నేను చూడలేదు. హిందీలో ఈ సినిమాను రీమేక్ చేస్తున్నాను” ఇది “డియర్ కామ్రేడ్” విడుదలకు సరిగ్గా రెండు రోజుల ముందు బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ లో ఒకడైన కరణ్ జోహార్ ఇచ్చిన స్టేట్ మెంట్. స్పెషల్ స్క్రీనింగ్ ద్వారా సదరు సినిమా చూసిన కరణ్ జోహార్ ఆ సినిమాను హిందీలో వేరే హీరోతో రీమేక్ చేస్తానని చెప్పడం తెలిసిందే. అయితే.. విడుదలైన తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాకి వచ్చిన రిసెప్షన్ ను చూసిన తర్వాత కరణ్ జోహార్ “డియర్ కామ్రేడ్” హిందీ రీమేక్ విషయంలో తర్జభర్జనలు పడుతున్నాడని తెలిస్తోంది.
ఇకపోతే.. “డియర్ కామ్రేడ్” ప్రారంభ వసూళ్లు బాగానే ఉన్నప్పటికీ.. సినిమా మెల్లమెల్లగా డౌన్ అవుతూ వచ్చింది. ఓవర్సీస్ లో ఇంకా 1 మిలియన్ కూడా క్రాస్ అవ్వలేదు. తెలుగు రాష్ట్రాల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డిస్ట్రిబ్యూటర్స్ భారీ స్థాయిలో నష్టాలు చవిచూసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దాంతో.. “సవ్యసాచి, అమర్ అక్బర్ ఆంటోనీ” లాంటి డిజాస్టర్స్ తర్వాత “చిత్రాలహరి”తో కాస్త ఊపిరి పీల్చుకున్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ “డియర్ కామ్రేడ్”తో మళ్ళీ నష్టాల ఊబిలోకి జారుకొంది.