త్రివిక్రమ్ సినిమా కంటే ముందే అల్లు అర్జున్ ఓ సినిమా చేస్తాడు అని ఇటీవల వార్తలు వచ్చాయి. ఇది నిజమా కాదా అనే విషయం తేలకముందే మరో పుకారు బయటకు వచ్చింది. అయితే ఈసారి వేరే యాంగిల్లో ఉంది. అల్లు అర్జున్‌తో సినిమా చేసే ముందే త్రివిక్రమ్ మరో సినిమా చేస్తారు అని. అదెలా సాధ్యం అని అనుకుంటున్నారా? ఇదే డౌట్ చాలామంది వచ్చింది. దీంతో టీమ్‌ను సంప్రదించే ప్రయత్నం చేస్తే… అలాంటి ఆలోచన ఏమీ లేదు అని చెప్పడం లేదు. అలా అని ఉందని కూడా చెప్పడం లేదు.
ప్రస్తుతం ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) సినిమాను సంక్రాంతి బరిలో దించే పనిలో ఉన్నారు. సినిమా అప్పటికి అవుతుందా లేదా అనే ప్రశ్న వినిపిస్తున్నా.. ‘మేమైతే సంక్రాంతికే వస్తాం’ అంటూ టీమ్ బలంగా చెబుతున్నారు. దీంతో వచ్చే ఫిబ్రవరి నుండి త్రివిక్రమ్ ఖాళీ అవుతారు అనే మాట వినిపిస్తోంది. అయితే ఆ సమయానికి అల్లు అర్జున్ ‘పుష్ప: ది రూల్’ ఇంకా పూర్తవవ్వదు. దీంతో బన్నీ వచ్చే లోపు త్రివిక్రమ్ ఓ సినిమా చేసేద్దాం అనుకుంటున్నారు అని లెక్కలేస్తున్నారు.
అయితే, అది చిన్న సినిమానా? లేక పెద్ద సినిమానా అనేదే ఇక్కడ విషయం. ‘పుష్ప 2’ వచ్చాక అంటే ఆగస్టు తర్వాతనే బన్నీ ఫ్రీ అవుతాడు. కాబట్టి ఈ ఆరేడు నెలల్లో ఓ పెద్ద సినిమానే తీసేయొచ్చు అని అంచనాలు వినిపిస్తున్నాయి. మరోవైపు బన్నీ నెక్స్ట్ సినిమా త్రివిక్రమ్‌ది కాకుండా అట్లీది చేస్తాడు అనే మాట కూడా వినిపిస్తోంది. ఇవన్నీ లెక్కలేసుకుని త్రివిక్రమ్ పెద్ద సినిమానే తలకెత్తుకుంటారు అని అంటున్నారు. అయితే ఆయన మధ్యలో రానా ‘హిరణ్య కశ్యప’ పనులు చేయాలి.
అయితే ఆ సినిమాకు రచనా సహకారం మాత్రమే. ‘గుంటూరు కారం’ రిలీజ్ అయ్యాక కానీ ఈ విషయంలో క్లారిటీ రాదు. ఎందుకంటే త్రివిక్రమ్ కూడా స్టార్ హీరోల రేంజిలో సినిమా సినిమాకు గ్యాప్ భారీగానే ఇస్తుంటారు. బన్నీ వచ్చేంతవరకు గ్యాప్ తీసుకుంటా అని ఆయన అనుకుంటే ఇంకే సినిమా మధ్యలో ఉండకపోవచ్చు.