క్యాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులు.. పేర్లు ఎలా ఉన్నా? ప్రస్తావన ఎలా ఉన్నా.. ఈ క్షమించరాని పరిస్థితి ప్రతి రంగంలోనూ ఉంది. దీనిపై తరచుగా ఎక్కడో దగ్గర విషయం చర్చకు వస్తోంది. వెంటనే మహిళలు, సంఘాలు ముందుకొచ్చి ఆందోళన చేస్తాయి. కొన్ని రోజుల తర్వాత పరిస్థితి ఆటోమేటిగ్గా కామ్ అయిపోతుంది. గత కొన్నేళ్లుగా సాగుతున్న ఈ పరిస్థితి టాలీవుడ్‌లో కూడా ఉంది అంటుంటారు. మాలీవుడ్‌లో జస్టిస్ హేమ కమిటీ రిపోర్టు రావడం, పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Jani Master) మీద లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో మరోసారి టాలీవుడ్‌లో (Tollywood) ఈ విషయంలో సీరియస్ చర్యలు అవసరం అనే చర్చ మొదలైంది.
ఈ క్రమంలో రెండు రకాల ఆప్షన్లు కనిపిస్తున్నాయి. ఒకటి ఇప్పటికే సిద్ధం చేసిన రిపోర్టు బయటకు తీసుకురావడం.. లేదంటే కొత్త కమిటీ వేయడం. టాలీవుడ్‌లో మహిళా నటుల విషయంలో, వారు ఎదుర్కొంటున్న పరిస్థితులపై అంచనా వేయడానికి, అధ్యయనం చేయడానికి ఓ కమిటీ రూపొందింది. కొన్నేళ్ల క్రితం.. క్లియర్‌గా చెప్పాలటే కరోనా – లాక్‌డౌన్ పరిస్థితుల నేపథ్యంలో ఆ నివేదిక సిద్ధమైనా, ప్రభుత్వం వద్దకు చేర్చినా బయట పడలేదు. అందులో ఏముంది, ఎవరి గురించి ఉంది అనే వివరాలు తెలియవు.
అయితే జానీ మాస్టర్ ఇష్యూ తర్వాత ఆ రిపోర్టు ప్రస్తావన మళ్లీ వస్తోంది. అసలు టాలీవుడ్ గురించి ఎలాంటి విషయాలు ఆ కమిటీ రూపొందించింది అనే ప్రశ్న వినిపిస్తోంది. జస్టిస్ హేమ కమిటీ రిపోర్టుతో పాటు, నాయిక పూనమ్ కౌర్ (Pooam Kaur) చేస్తున్న ఆరోపణలు కూడా ఆ నివేదిక బయటకు రావాలనే వాదనకు బలం చేకూరుస్తున్నాయి.
మరి తెలంగాణ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ప్రభుత్వం ముందుకురాకపోతే సినిమా పరిశ్రమ అంతా కలసి ముందుకొస్తుందేమో చూడాలి. ఎందుకంటే మరక పడ్డాక తుడుచుకోవడం ఎంత ముఖ్యమో.. ఇలాంటి ఆరోపణలు, విమర్శలను తేల్చేయడమూ అంతే అవసరం. మరి టాలీవుడ్ ఏమంటుందో?