సినిమా పరిశ్రమలో మహిళా సాధికారత, సమానత్వం… గురించి మాట్లాడే నటీమణుల్లో కంగన రనౌత్ ఒకరు. సినిమా పరిశ్రమ ఎలా ఉండాలి, నటీనటులు- సాంకేతిక నిపుణులకు ఎలా గౌరవం ఇవ్వాలి అని చెబుతూ ఉంటారు. దీనిపై ఆమె పెద్ద ఎత్తున క్లాస్‌లు పీకిన సందర్భాలూ ఉన్నాయి. అయితే వాటిని ఆమె ఆచరణలో పెడుతోందా అంటే… సమాధానం మౌనమే వస్తుంది. కారణం ఆమె సినిమాల విషయంలో జరుగుతున్న మార్పులు, చేర్పులే. ఎప్పుడో అయిపోయిన విషయమే కానీ…
ఇప్పుడు గుర్తు చేయాల్సిన అంశం ఇదీ. ‘మణికర్ణిక’ సినిమా విషయంలో ఏం జరిగింది. సినిమా చిత్రీకరణ చివరిదశకు వచ్చినప్పుడు కొన్ని సీన్లు నచ్చలేదు అంటూ, కొన్ని సీన్లు అవసరం లేదంటూ ఏకంగా నటుడు సోనూ సూద్ పాత్రనే తీసేశారు. ఆ తర్వాత దర్శకుడిని తప్పించారు. కారణం అడిగితే… క్రియేటివ్ డిఫరెన్స్ అన్నారు. జరిగిన కథను చెబుతున్నప్పుడు, జరగని సన్నివేశాలు యాడ్ చేశారు అని ఆ తర్వాత క్రిష్ సన్నిహితులు కూడా చెప్పారు.
పాత విషయం ఇప్పుడెందుకు అనుకుంటే… రీసెంట్‌గా వచ్చిన ‘తలైవి’నే తీసుకోండి. ఈ సినిమాకు రచయిత అయిన విజయేంద్ర ప్రసాద్ ఇచ్చిన సన్నివేశాలు కాకుండా తమకు నచ్చినట్లుగా కొన్ని సన్నివేశాలను టీమ్‌ని పెట్టి రాయించుకున్నారట. ఈ విషయంలో దర్శకుడు విజయ్‌ను అంటున్నా… దాని వెనుక కంగన ప్రోత్సాహం ఉందని టాక్. మరిలా దర్శకులు, రచయితల ఆలోచనలు, జరిగిన విషయాల్ని కాదని సొంతంగా రాసుకోవడాన్ని కంగన ఏమంటుందో.