ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమాకు ఏమైంది? అనుకున్న సమయానికి ఎందుకు రాదు అని మొన్నీమధ్యే మన సైట్‌లో చదివి ఉంటారు. త్వరలో షూటింగ్ ప్రారంభం అని అంటున్నారు కానీ.. ఆ వైబ్స్ ఎక్కడా కనిపించడం లేదు అని పరిశ్రమ వర్గాలు సమాచారం. దీంతో ఎందుకీ బ్రేకులు.. ఏం జరుగుతోంది అని కొందరు అనుకుంటుంటే.. అసలేంటీ లీకులు అని మరికొందరు అంటున్నారు. అంతలా చిత్రబృందంలో ఏం జరుగుతోంది? లీకులు వస్తున్నట్లుగా నిజంగానే ఇబ్బంది ఉందా?
‘దేవర’ సినిమా విజయం అందించినా, రూ.600 కోట్ల వసూళ్లు సాధించినా.. అభిమానులు మాత్రం వెలితితోనే ఉన్నారు. వసూళ్ల నెంబర్లలో నిజం లేదు అని ఆ సినిమాను రిలీజ్ నిర్మాత నాగవంశీ చెప్పడం ఒక కారణమైతే.. ఓటీటీలోకి వచ్చాక మీమర్స్‌కు ఆ సినిమాలో కంటెంట్ సోర్స్ మెటీరియల్ అవ్వడం మరో కారణం. దీంతో హిట్ లోటును ‘వార్ 2’ సినిమా తీర్చేస్తుంది అనుకున్నారు. కానీ ఆ సినిమా దారుణమైన ఫలితాన్ని అందుకుంది. దీంతో అందరి చూపు వచ్చే ఏడాది వస్తుందంటున్న ‘డ్రాగన్’ (రూమర్డ్ టైటిల్) మీదే పడింది.
కానీ ఆ సినిమా గురించి లేనిపోని రూమర్స్ వస్తున్నాయి. ఇప్పటివరకు వచ్చిన అవుట్‌పుట్ చూశాక ఎక్కడో లోటుగా ఉందని టీమ్ భావిస్తోంది అని ఓ పుకారు మొదలైంది. అందుకే షూటింగ్ షెడ్యూల్ వాయిదా వేసి మరోసారి టీమ్ అంతా కూర్చుని డిస్కస్ చేసుకుంటున్నారట. అంతా ఓకే అయితే కొత్త షెడ్యూల్ ప్రారంభిస్తాం అని చెబుతున్నారట. అయితే ఇక్కడ మరో సమస్య ఏంటంటే.. ఈ సినిమా ఆలస్యమైతే ‘దేవర 2’, త్రివిక్రమ్ ‘కార్తికేయ’ (రూమర్డ్ టైటిల్) కూడా ఆలస్యమవుతాయి. అవి ఇంకా బాధపెట్టించే అంశాలు.
ఏంటి కాస్త గ్యాప్‌కే ఇన్ని పుకార్లా అని అనుకుంటున్నారా? నిజమే మరి రెండు నెలల నుండి సినిమా షూటింగ్ ప్రారంభం కావడం లేదు. పోనీ ప్రశాంత్ నీల్ ఏమన్నా హైదరాబాద్‌లో లేరా అంటే ఇక్కడే ఉన్నారు మరి. మొన్నీమధ్య ‘ఓజీ’ సినిమా ప్రీమియర్ షోని హైదరాబాద్‌లోనే చూశారు.