Raj Nidimoru: సమంతను పెళ్లాడిన రాజ్.. అతని గురించి ఈ విషయాలు తెలుసా?

సమంత రూత్ ప్రభు రెండో పెళ్లి వార్త ఇప్పుడు ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ గా మారింది. ‘ఫ్యామిలీ మ్యాన్’ డైరెక్టర్ రాజ్ నిడమూరుతో ఆమె ఏడడుగులు వేసినట్లు అధికారికంగా ప్రకటించడంతో అందరి దృష్టీ ఆయనపై పడింది. అసలు ఎవరు ఈ రాజ్ నిడమూరు? బాలీవుడ్ డైరెక్టర్ కదా, నార్త్ ఇండియన్ అనుకుంటే పొరపాటే. రాజ్ నిడమూరు పక్కా మన తెలుగు వాడే. తిరుపతిలో పుట్టి, అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసి, సినిమా పిచ్చితో డైరెక్టర్‌గా మారిన అతని ప్రయాణం చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

RAJ NIDIMORU

రాజ్ నిడమూరు పుట్టింది ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో. కానీ ఆయన చదువు మొత్తం వైజాగ్‌లో సాగింది. చిన్నప్పటి నుంచే చదువులో బ్రైట్ స్టూడెంట్ అయిన రాజ్, తిరుపతిలోని ఎస్వీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి, అక్కడ కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు. కొన్నాళ్ల పాటు అమెరికాలోనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేశారు. అక్కడే తన చిరకాల మిత్రుడు కృష్ణ డీకే (DK) పరిచయమయ్యాడు. ఇద్దరికీ సినిమాలంటే పిచ్చి కావడంతో, ఉద్యోగాలు చేస్తూనే షార్ట్ ఫిల్మ్స్ తీయడం మొదలుపెట్టారు.

రాజ్ ఎప్పుడూ సోలోగా సినిమాలు చేయలేదు. తన మిత్రుడు డీకేతో కలిసి ‘రాజ్ అండ్ డీకే’ పేరుతోనే సినిమాలు రూపొందిస్తారు. 2003లో ‘ఫ్లేవర్స్’ అనే సినిమాతో వీరి ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత ’99’, ‘షోర్ ఇన్ ది సిటీ’ వంటి సినిమాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. అయితే వీరిని స్టార్ డైరెక్టర్లుగా మార్చింది మాత్రం ‘గో గోవా గాన్’ సినిమానే. జాంబీ కామెడీ అనే కొత్త జోనర్‌ను ఇండియన్ స్క్రీన్‌కు పరిచయం చేసి అందరి దృష్టిని ఆకర్షించారు.

కానీ రాజ్ కెరీర్‌ను హై లెవెల్ కి తీసుకు వెళ్లింది మాత్రం ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్. మనోజ్ బాజ్‌పేయి ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సిరీస్ ఓటీటీ రికార్డులను తిరగరాసింది. ఈ సిరీస్ రెండో సీజన్ కోసమే సమంతను ‘రాజి’ పాత్రకు ఎంపిక చేశారు. ఆ సమయంలోనే సమంత నటన, డెడికేషన్ చూసి రాజ్ ఫిదా అయ్యారట.

అప్పుడే వారి మధ్య స్నేహం చిగురించిందని టాక్. ఆ తర్వాత ‘ఫర్జీ’, ‘గన్స్ అండ్ గులాబ్స్’, తాజాగా ‘సిటాడెల్: హనీ బన్నీ’ వంటి సిరీస్‌లతో రాజ్ అండ్ డీకే ఓటీటీ కింగ్‌లుగా మారిపోయారు. రాజ్ నిడమూరు వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే, ఆయన గతంలో శ్యామలీ అనే యువతిని వివాహం చేసుకున్నారు. ఆమె కూడా సినిమా ఇండస్ట్రీలోనే పనిచేశారు. 2015లో ఒక్కటైన వీరు, కొన్ని కారణాల వల్ల 2022లో విడాకులు తీసుకున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus