సంక్రాంతికి రావాల్సిన ‘విశ్వంభర’ (Vishwambhara) సినిమాను పోస్ట్‌పోన్ చేయడంతో ఇన్నాళ్లూ బిజీబిజీగా షూటింగ్ చేసిన సినిమా టీమ్ ఒక్కసారి కామ్ అయిపోయింది. టైమ్ ఉంది కదా ఈలోపు కాస్త సేదతీరుదాం అని చిరంజీవి (Chiranjeevi) .. సినిమా టీజర్ విషయంలో వచ్చిన నెగిటివ్ అంశాలు చూసుకొని సెట్‌రైట్ చేసుకుందామని సినిమా డైరక్షన్ టీమ్ బిజీగా ఉన్నారు. అయితే మరో టీమ్ ప్రీప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అయితే ఆ టీమ్‌కి కెప్టెన్ ఎవరు అనేది తేలడం లేదు అని అంటున్నారు.
‘విశ్వంభర’ సినిమా షూటింగ్ అయిపోయిన వెంటనే చిరంజీవి కొత్త సినిమా ప్రారంభించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. చిరు తనయ సుస్మిత (Sushmita Konidela) , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కలసి ఓ సినిమా చేస్తాయని సమాచారం. ఈ సినిమాకు బీవీఎస్ రవి (B. V. S. Ravi) కథ అందిస్తారు అని ఇటీవల తేలింది. అయితే ఆ సినిమా దర్శకుడు ఎవరు అనేది ఇంకా తేలడం లేదు. ఇద్దరు యువ దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే ఓ సీనియర్ దర్శకుడి పేరు కూడా వినిపిస్తోంది.
చిరు (Chiranjeevi) కోసం మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న ఓ మెసేజ్ ఓరియంటెడ్ కథను సిద్ధం చేసినట్టు ఇటీవల బీవీఎస్ రవి చెప్పారు. కథ విని చిరు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారని తెలిపారు. ‘ఠాగూర్’ (Tagore), ‘స్టాలిన్’ (Stalin) తరహాలో సమాజానికి సందేశం ఇస్తూ, ఆలోచింపజేసే కథ కావడంతో ఆయనకు బాగా నచ్చిందని చెప్పారు. అయితే ఈ సినిమాకు దర్శకుడు ఎవరు అనే విషయంలో మరోమారు చర్చలు జరుగుతున్నాయట.
గతంలో వచ్చిన పుకార్ల ప్రకారం అయితే ఈ సినిమాకు దర్శకత్వం వహించడానికి మోహన్ రాజా (Mohan Raja)పేరు వినిపించింది. ఆ తర్వాత ఆ స్థానంలో హరీశ్ శంకర్ (Harish Shankar) వచ్చారు అని చెప్పారు. ఆ తర్వాత ఆ రెండు ప్రాజెక్టులు వేర్వేరు అని అన్నారు. తాజాగా ఈ చర్చలో సీనియర్ దర్శకుడు వీవీ వినాయక్ (V. V. Vinayak) పేరు వచ్చింది. ఇలాంటి కథలను ఆయన బాగా హ్యాండిల్ చేయగలరని, చిరంజీవి లాంటి స్టార్ హీరోను ఆయన బాగా హ్యాండిల్ చేయగలరు అనే టాపిక్ చర్చలోకి వచ్చిందని టాక్. త్వరలో ఈ విషయంలో క్లారిటీ వచ్చేస్తుంది అంటున్నారు.