మనకు అన్ని సినిమాలు ఒక్కటే.. ఎవరు సినిమా చేసినా బాగుంటే ఆదరిస్తాం. కానీ ఇదే రెస్పాన్స్ మన సినిమాలకు అక్కడ ఉంటోందా? అంటే కచ్చితంగా లేదు అనే చెప్పాలి. కనీసం రెస్పాన్స్ వచ్చేలా థియేటర్లు కూడా దక్కడం లేదు అంటే అతిశయోక్తి కాదు. ఇదేదో ఇండియన్ సినిమా వర్సెస్ విదేశీ సినిమా అని అనుకునేరు. తెలుగు సినిమా వర్సెస్ రెస్టాఫ్ తెలుగు సినిమా పరిస్థితి ఇది. గత కొంత కాలంగా ఈ విషయంలో కొన్నిసార్లు, కొంతమంది హీరోల అభిమానులు ఈ మాట అంటున్నా ఆ హీరోలు, నిర్మాతలు పెద్దగా పట్టించుకోవడం లేదు.
అగ్ర హీరోల సినిమాలకు కూడా ఇతర భాషల్లో ముఖ్యంగా తమిళ సినిమా పరిశ్రమలో ఆశించిన రెస్పాన్స్ లేకపోయినా పట్టించుకోవడం లేదు. అంతేకాదు ఈ విషయమై స్పందించడం లేదు కూడా. అయితే తొలిసారి ఓ హీరో ఈ టాపిక్ ప్రెస్ మీట్‌లో రెయిజ్ చేశాడు. ఆ హీరోనే కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) . తన కొత్త సినిమా ‘క’ (KA) విడుదలై మంచి టాక్ సంపాదించుకుంటున్న నేపథ్యంలో కిరణ్ మీడియాతో మాట్లాడుతూ తమిళనాట రిలీజ్ గురించి మాట్లాడాడు.
తమ సినిమాకు అక్కడ కనీసం థియేటర్లు ఇవ్వడానికి కూడా ముందుకు రావడం లేదు కామెంట్ చేశాడు. పాన్ ఇండియా లెవల్‌లో తన సినిమాను రిలీజ్ చేద్దామని కిరణ్ ప్లాన్ చేశాడు. బాలీవుడ్‌లో ముందుగానే థియేటర్లు దొరకడం కష్టమని తెలిసి.. సౌత్ రిలీజ్‌కి ముందుకొచ్చాడు. అనుకున్నట్లుగానే అక్టోబరు 31న సినిమాను తీసుకొచ్చాడు. అయితే తమిళనాడులో తన సినిమాకు స్క్రీన్లు దొరకలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తెలుగు రాష్ట్రాలలో టికెట్లు లభించడం లేదని తనకు సన్నిహితులు ఫోన్లు చేస్తున్నారని..
అదే తమిళనాట ఏకంగా థియేటర్లే దొరకడం లేదని సమాచారం వస్తోందని అన్నాడు. తమిళ వెర్షన్ కాకపోయినా తెలుగు వెర్షన్ అయినా అక్కడ వేసే అవకాశం ఉంటే బాగుండు అని కామెంట్ చేశాడు. దీంతో మనం ‘అమరన్’ (Amaran) సినిమాను గౌరవించి థియేటర్లు ఇచ్చాం. కానీ మన సినిమాకు తమిళనాట స్క్రీన్లు ఇవ్వరు అనే మాట వినిపిస్తోంది. మొన్నీమధ్య ‘దేవర’కు (Devara) కూడా ఇలానే ఇబ్బంది కలిగింది అని గుర్తు చేస్తున్నారు. మరి కిరణ్ (Kiran Abbavaram) ఎత్తిన గొంతు అక్కడితో ఆగుతుందా? లేక వేరే హీరోలు ఏమన్నా గొంతు కలుపుతారా అనేది చూడాలి.