నకిలీ పోలీసు అధికారులు, కస్టమ్స్ అధికారులుగా ఫోన్ చేసి డబ్బులు కొట్టేశారు అంటూ కొన్ని ఘటనలను మనం తరచుగా వార్తల్లో చూస్తుంటాం. అలా ఎలా మోసపోయారు అని అనుకుంటూ వేరే వార్తల్లోకి వెళ్లిపోతుంటాం. అయితే నిరక్షరాస్యుల విషయంలోనే ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి అంటారు. కానీ కొన్నిసార్లు బాగా చదువుకున్న వాళ్లు, సమాజంలో సెలబ్రిటీలుగా ఉన్నవాళ్లు కూడా ఇలా బొక్కబోర్లా పడుతుంటారు. అలా ఓ స్టార్ నటి కూడా ఇబ్బందుల్లో పడింది. మొత్తంగా ఐదున్నర లక్షలు కోల్పోయింది.
తెలుగులో 2013లో వచ్చిన ‘నా బంగారు తల్లి’ సినిమా గుర్తుందా? అందులో నటించిన అంజలి పాటిల్ ఇప్పుడు ఈ మోసానికి గురైంది. తమిళంలో ‘కాలా’ సినిమాలో నటించింది. అలాగే హిందీలో ‘ది సైలెన్స్’, ‘న్యూటన్’, ‘సమీర్’ తదితర సినిమాల్లోనూ తనదైన నటనతో మెప్పించింది. ఆమె నుండి గుర్తు తెలియని వ్యక్తులు ఏకంగా రూ. 5.79 లక్షలు కొట్టేశారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అంజలి పాటిల్‌కు దీపక్ శర్మ అనే వ్యక్తి ఫోన్ చేసి తాను కొరియర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్టు చెప్పారు. తైవాన్ వెళ్తున్న పార్శిల్స్‌లో డ్రగ్స్ ఉన్నాయని చెప్పాడు. ఆ పార్శిల్‌పై అంజలి ఆధార్ వివరాలున్నట్టు ఆమెకు చెప్పాడు. వాటిని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారని చెప్పారు. ఈ విషయంలో సైబర్ పోలీసులను కలవాలని అంజలికి చెప్పాడు. దీంతో ఏమైందా అని అంజలి కన్‌ఫ్యూజన్‌లో ఉండగానే బెనర్జీ అనే వ్యక్తి కాల్ చేసి ముంబయి సైబర్ పోలీసునని చెప్పారు.
ఆ తర్వాత ఈ కేసు విషయం తేల్చడానికి చెప్పి ఆమె (Anjali) నుండి మొత్తంగా రూ.5.79 లక్షలు కాజేశాడు. అయితే ఆ తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆన్సర్ చేయకపోవడంతో అంజలి పోలీసులను ఆశ్రయించారు. ఆ తర్వాత ఆమె డీఎన్ నగర్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రస్తుతం దర్యాప్తు చేపట్టారు. అయితే ఇక్కడ డౌట్స్ ఉన్నాయంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. డ్రగ్స్ ఉన్నాయి అనగానే ఆమె ఎందుకు భయపడింది. అసలు ఆలోచించకుండా అంత అమౌంట్ ఎందుకు పంపించేసింది అనేది ఆ చర్చ సారాంశం.