‘మేం ఎన్నైనా అంటాం… నువ్వు ఒక్క మాట అన్నా ఊరుకోం’.. ఇదో రకం. ‘మేం మా వాళ్లతో ఏమైనా అనిపిస్తాం, ఏదైనా తిట్టిస్తాం… నువ్వు మా మీద జోకేస్తే ఊరుకోం’. ఈ రెండు చదువుతుంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సినిమా – రాజకీయాల్లో జరుగుతున్న ఓ విషయం స్ఫురించకమానదు. అదే శ్యాంబాబు vs రాంబాబు. పవన్ కల్యాణ్ ‘బ్రో’ సినిమాలోని శ్యాంబాబు పాత్ర చాలా చిన్నది. కానీ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో పెద్ద విషయంగా మారింది. కారణం ఆ పాత్ర తనను ఉద్దేశించి రాసిందే అని ఏపీ మంత్రి అంబటి రాంబాబు వాదిస్తుండటమే.
ఈ విషయంలో ఓవైపు జనాలు వైసీపీకి సపోర్టు చేస్తుండగా, మరోవైపు పవన్ కల్యాణ్‌కు సపోర్టు చేస్తున్నారు. అయితే తటస్థులు మాత్రం సినిమాలు, రాజకీయాలు కలపొద్దు.. వేర్వేరుగానే చూడండి అంటూ మాట్లాడుతున్నారు. అయితే ఇందులో తప్పు ఉంది అంటూ మంత్రి అంబటి రాంబాబు అయితే ‘బ్రో’ నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ను, సినిమా రచయిత త్రివిక్రమ్‌ను ఆడిపోసుకుంటున్నారు. అయితే ఈ మాటలకు నిర్మాత నుండి గట్టిగా రిటార్ట్ వచ్చింది. శ్యాంబాబు పాత్ర వేసిన పృథ్వీ నుండి కూడా అంతే మోతాదులో రాంబాబుకు ఆన్సర్ వచ్చింది.
ఇదంతా ఓకే.. మాటలు వస్తున్నాయి, పోతున్నాయి. శ్యాంబాబు, రాంబాబుకు సంబంధం లేదు అని అంటున్నారు కానీ… ఆ మాటకొస్తే నిజ జీవిత పాత్రను సినిమాల్లో చూపించడం తప్పా అని ప్రశ్నించేవాళ్లూ ఉన్నారు. గతంలో ఎప్పుడూ చూపించలేదా అంటూ గతాలు తవ్వుతున్నారు కూడా. ఆ సినిమాలో పాత్ర ఆ నాయకుడిదే కదా అంటూ లెక్కలు తీస్తున్నారు. అంతెందుకు వైసీపీ నాయకులు రామ్‌గోపాల్ వర్మతో తీయిస్తున్న సినిమాల్లో పవన్ కల్యాణ్‌ను ఇబ్బందికరంగా చూపిస్తున్నారు కదా అంటూ ప్రశ్నిస్తున్నారు కూడా.
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అంటూ ఆ మధ్య రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమాలో రాజకీయ నాయకుల పాత్రల్ని వేరేవాళ్లతో చేయించారు. ‘పవర్ స్టార్’ అంటూ ఆయన ఏకంగా పవన్ మీదే సినిమా చేశారు. మరి అప్పుడు వాళ్లందరికీ ఎందుకు కోపం రాలేదో అంటూ వైసీపీ నాయకుల్ని ఉద్దేశించి కొన్ని కామెంట్స్ కూడా కనిపిస్తున్నాయి.