Jr NTR: కొరటాల సినిమా అప్‌డేట్‌ తారక్‌ ఇచ్చాడు.. ఈసారైనా జరుగుతుందా?

సినిమా అప్‌డేట్‌ ఇవ్వండి బాబు.. సినిమా అప్‌డేట్‌ ఇవ్వండి బాబు.. సినిమా అప్‌డేట్‌ ఇవ్వండి బాబు.. ఇంతకుమించి అభిమానులు, ప్రేక్షకులు హీరోను కానీ, దర్శకుడిని కానీ, నిర్మాతలను కానీ అడగగలరా. మహా అయితే ఒకే మాట నాలుగైదుసార్లు, నాలుగైదు మాడ్యులేషన్లలో అడగగలరు. ఎందుకంటే ఇదిగో సినిమా, అదిగో సినిమా వాళ్లే గతంలో లీక్‌లు ఇచ్చారు కాబట్టి.. అభిమానులు పదే పదే అడుగుతుంటారు. అయితే ఆ మాత్రం దానికే అభిమానుల మీద హీరోలు కోప్పడలా? ఏమో ఆ హీరో కోపం అభిమానులకు ఓకే అవ్వొచ్చేమో..

కానీ చూసేవాళ్లకు ఎందుకిలా కోపమయ్యారు అనే ఆలోచన అయితే కలుగుతుంది. ఇదంతా ఎన్టీఆర్‌ గురించి, కొరటాల సినిమాతో అప్‌డేట్ గురించి అని మీకు అర్థమయ్యే ఉంటుంది. ‘అమిగోస్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి వచ్చిన తారక్‌ ఆ సినిమా గురించి చెబుతూ.. తన తర్వాతి సినిమా అప్‌డేట్‌ గురించి కూడా ప్రస్తావించాడు. ఎందుకు అడుగుతున్నారు, మేమే చెబుతాం కదా.. కంగారెందుకు అంటూ కాస్త గద్దించి మాట్లాడాడు. ఆ తర్వాత అప్‌డేట్‌ కూడా చెప్పాడనుకోండి.

అయితే ఇక్కడే ఓ డౌట్‌. చెప్పేదేదో చెప్పకుండా కోపమెందుకు అయ్యాడు అనేదే ప్రశ్న. దీంతో అప్‌డేట్‌ వచ్చిన ఆనందం కన్నా.. తారక్‌ ఎందుకు ఫైర్‌ అయ్యాడనే బాధ ఎక్కువగా ఉందట అభిమానులకు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ త‌ర‌వాత ఎన్టీఆర్ సినిమా ఇప్పటివరకు పట్టాలెక్కలేదు. గతేడాది సంక్రాంతి సందర్భంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రచారంలో కొరటాల శివ, తారక్‌ ఇద్దరూ త్వరలో మా సినిమా ప్రారంభం అని చెప్పారు. అయితే ‘ఆచార్య’ లాంటి డిజాస్టర్‌ కొరటాల నుండి రావడంతో మొత్తంగా పరిస్థితి మారిపోయింది.

రేపో మాపో అనుకున్న సినిమా వాయిదాలు పడుతూ వచ్చింది. అలా అలా ఏడాది అయిపోయింది. దీంతో ఇటీవల అభిమానుల నుండి అప్‌డేట్‌ కోసం ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తారక్‌ మాట్లాడుతూ ఈ నెల‌లోనే కొర‌టాల సినిమా మొద‌ల‌వుతుంద‌ని, మార్చిలో సెట్స్‌పైకి వెళ్తుంద‌ని చెప్పాడు. అంతేకాదు 2024 ఏప్రిల్‌లో సినిమాను విడుద‌ల చేస్తామ‌ని కూడా చెప్పాడు. దీంతో కొర‌టాల సినిమాకి లైన్ క్లియ‌ర్ అయిన‌ట్టే అనుకుంటున్నారు. అయితే ఇలాంటి ప్రకటనలు గతంలోనూ జరిగాయి, మురిగిపోయాయి అనే విషయం ఇక్కడ గుర్తుంచుకోవాలి.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus