Prabhas: షూటింగ్‌లో ఫుడ్‌ పెట్టడం కాదు ప్రభాసూ.. ఈ ఫుడ్‌ ఆర్డర్‌లు కూడా ఆపాలి!

ప్రభాస్‌ గురించి అభిమానులు నటన, లుక్‌, ఫిజిక్‌, రాజసం గురించి మాట్లాడుతుంటారు. ఆయనతో పాటు కలసి పని చేసిన సినిమా జనాలు అయితే వీటితో పాటు మరో విషయం గురించి కూడా మాట్లాడతారు. అదే ఆయన పెట్టే ఫుడ్‌. తనతో పని చేసే ముఖ్య నటులకు ఫుడ్‌ బాగా పెట్టడంలో ప్రభాస్‌ చాలా ఆనందపడతారు. ఈ విషయాన్ని చాలా మంది మీడియా ముఖంగానే చెప్పారు కూడా. ఆ మధ్య ఓ కార్యక్రమం జరిగినప్పుడు ఫ్యాన్స్‌కి కూడా ప్రభాస్‌ ఫ్యామిలీ ఇలానే ఫుడ్‌ పెట్టింది. అలాంటి ప్రభాస్‌ ఇప్పుడు ఓ ఫుడ్‌ ఫెస్టివల్‌ని ఆపాల్సిన అత్యవసరం ఏర్పడింది.

Prabhas

ఫుడ్‌ ఫెస్టివల్‌ అనే కంటే ఫుడ్‌ డెలివరీ ఫెస్టివల్‌ అంటే బాగుంటుందేమో. ఎందుకంటే ‘ప్రభాస్‌ రాజా సాబ్‌’ సినిమా ఫ్లాప్‌ అయినప్పటి నుండి ఆ సినిమా దర్శకుడు మారుతిని ప్రభాస్‌ అభిమానుల పేరిట కొంతమంది చాలా ఇబ్బంది పెడుతున్నారు. సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో మారుతి అడ్రెస్‌ చెప్పడంతో దానికి కొంతమంది ఆకతాయిలు ఫుడ్‌, గ్రాసరీ ఆర్డర్‌ పెడుతున్నారు. తొలుత పేమెంట్‌ చేసి ఆర్డర్‌లు పెట్టగా.. ఇప్పుడు క్యాష్‌ ఆన్‌ డెలివరీ పెడుతున్నారు. దీంతో ఫుడ్‌ డెలివరీ పర్సన్స్‌ అక్కడికి వెళ్లడం, సెక్యూరిటీ ఆపేయడం జరుగుతూనే ఉంది.

ఈ విషయంలో మారుతి నేరుగా ఇప్పటివరకు స్పందించకపోయినా, సోషల్‌ మీడియాలో ఇబ్బందులు పెడుతున్నారని ఆ సినిమా ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత, మారుతి స్నేహితుడు ఎస్‌కేఎన్‌ సైబర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఈ క్యాష్‌ ఆన్‌ డెలివరీ ఆర్డర్‌లు ఎక్కువయ్యాయి అని చెబుతున్నారు. ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ మీద మారుతి కన్నీళ్లు పెట్టుకుంటే దగ్గరకొచ్చి ఓదార్చిన ప్రభాస్‌ ఇప్పుడు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

బాగా ఫుడ్‌ పెట్టి ఒక ఆనందకరమైన ఇబ్బంది పెడతారు అని ప్రభాస్‌కి పేరుంది. మరిప్పుడు ఈ ఇబ్బందిని ఆపాల్సిన పని కూడా ఆయనే చేయాలి. మరి ఇప్పటికైనా ఆయన స్పందిస్తారేమో చూడాలి. ఎందుకంటే మారుతి ఎంత ఇబ్బందిపడుతున్నారో తెలియదు కానీ, ఫుడ్‌ డెలివరీ పర్సన్స్‌, ఆ సంస్థలు చాలా ఇబ్బందిపడుతున్నాయి.

రణ్‌వీర్‌పై కేసు నమోదు.. ‘కాంతార’ ఇమిటేషన్‌ ఎఫెక్ట్‌ ఆగేలా లేదుగా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus