పూరీ జగన్నాధ్ ఇప్పటివరకూ ఎన్ని హిట్ సినిమాలు తీశాడో, అంతకుమించిన ఫ్లాప్ సినిమాలను కూడా తీశాడు. కానీ.. ఒక సినిమా విషయంలో ఎప్పుడూ కూడా ఈ స్థాయిలో దిగజారలేదు. “మెహబూబా” ఫ్లాప్ అనే విషయం మొదటి ఆటకే స్ప్రెడ్ అయిపోవడంతో సినిమాకి కనీస స్థాయి కలెక్షన్స్ రాలేదు. దాంతో అప్పటివరకూ మీడియాకి దూరంగా ఉన్న పూరీ.. ఒక్కసారిగా లైవ్ షోస్ లో పార్టీసిపేట్ చేయడం మొదలెట్టాడు. ఇక ట్విట్టర్ లో సినిమా బాగుంది అంటూ ఏ ఒక్కరు ట్వీట్ చేసినా దాన్ని రీట్వీట్ చేస్తూ తెగ సంతోషపడిపోతూ.. “నా సినిమా సూపర్ హిట్, నా కొడుకు సూపర్” అంటూ చంకలు గుద్దుకుంటున్నాడు పూరీ.
ఇది అమాయకత్వమో, వెర్రితనమో తెలియక తికమకపడుతున్నారు పూరీ వీరాభిమానులు. ఎంత కొడుకు లాంచ్ సినిమా అయితే మాత్రం ప్రేక్షకులు, విశ్లేషకులు ఇచ్చిన వెర్డిక్ట్ ను యాక్సెప్ట్ చేయాలి కానీ.. ఇలా అందరు రిజెక్ట్ చేసిన సినిమాని “హిట్, హిట్” అంటూ సొంత డబ్బా కొట్టుకోవడం, సినిమాకి తక్కువ రేటింగ్ ఇచ్చిన వెబ్ సైట్స్ పై గుర్రుగా ఉండడం అనేది ఎంతవరకూ సమంజసం. ఇదే పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహించిన “టెంపర్” హిట్ అయినప్పుడు ఆ సినిమా విజయతీరానికి చేర్చడానికి మీడియా నడుం బిగించిన విషయాన్ని కూడా పూరీ దృష్టిలో పెట్టుకొంటే బాగుంటుంది.