‘పుష్ప 1’ (Pushpa) సినిమాకు వచ్చిన ఆదరణ వల్లే ‘పుష్ప 2’కి (Pushpa2 The Rule) హైప్ వచ్చిందని అనుకుంటారు కానీ.. సినిమా తొలి టీజర్‌కి వచ్చిన హైపే ప్రధానమైన కారణం అని చెప్పాలి. ‘పులి రెండు అడుగులు వెనక్కి వేసింది అంటే పుష్ప వచ్చినట్లు’ అనే డైలాగ్‌లో ముగిసిన టీజర్ మీకు గుర్తుండే ఉంటుంది. ఆ డైలాగే కాదు.. టీజర్ మొత్తం ఓ లెవల్‌లో ఉంటుంది. ‘వేర్ ఈజ్ పుష్ప’ అంటూ మొదలయ్యే ఆ సీన్స్ ఇప్పుడు సినిమాలో లేవు.
అవును, ‘పుష్ప: ది రూల్’లో ఆ సీన్స్ ఏవీ లేవు. సినిమాలో ఆ సీన్స్ కూడా ఉండి ఉంటే ఓ లెవల్‌లో ఎలివేట్ అయ్యేవి అంటూ అభిమానులు కూడా వాటి గురించే మాట్లాడుకుంటున్నారు. అంత కష్టపడి చిత్రీకరించి, అంత కష్టపడి ప్రమోట్ చేసిన ఆ సూపర్బ్ సీన్స్ ఎందుకు సినిమాలో తీసేశారు అనే ప్రశ్న గట్టిగా వినిపిస్తోంది. దీనికి రెండు రకాల ఆన్సర్లు వస్తున్నాయి. ఒకటి తీసేశారని, రెండోది దాచేశారని.
తిరుపతి జైలు నుండి బుల్లెట్ గాయాలతో పుష్ప తప్పించుకున్నాడంటూ రిలీజ్ చేసిన ఆ వీడియో విషయంలో చిన్నపాటి నెగిటివిటీ కూడా వచ్చింది. పుష్ప దందా చేసి సంపాదించిన డబ్బులను పంచిపెట్టినట్టు చూపించిన సీన్స్ వల్ల సినిమా థీమ్ మారిపోయిందని కొందరు అన్నారు. ఆ విషయం ఏమైనా టీమ్ వరకు వెళ్లిందా? అందుకే తీసేశారా అని అంటున్నారు.
మరికొందరేమో ‘పుష్ప 2’ సినిమా క్లైమాక్స్‌లో బాంబు పేలిన తర్వాత ‘పుష్ప’ పోలీసులకు దొరికిపోతాడని.. అక్కడి నుండి భార్యతో కలసి తప్పించుకుని అడవుల్లోకి వెళ్లిపోయి తన ర్యాంపేజ్ చూపిస్తాడని చెబుతున్నారు. ఇందులో ఏది నిజమో తెలియదు కానీ మంచి హై ఇచ్చే సీన్ అయితే మిస్ అయ్యాం. నిజానికి ఆ సీనే కాదు జపాన్‌లో డీల్ చేసే సీన్ కూడా మిస్ అయ్యాం. అదేమైందో తెలియాలి. ఇక జాలి రెడ్డి తిరిగి ఫామ్‌లోకి వచ్చిన సీన్ కూడా అదే పరిస్థితి.