ఇండియన్ సినిమా మారుతున్నట్లే.. టాలీవుడ్ కూడా మారుతోంది. కొన్నేళ్ల క్రితం అందరూ డిస్కస్ చేసుకొని లేనిపోని ఫ్యాన్ వార్స్‌కి కారణమైన ‘టాప్’ టైర్ కాన్సెప్ట్‌ను ఇప్పుడు మాట్లాడటం తగ్గించేశారు. మా హీరో గొప్ప అంటే.. మా హీరో గొప్ప అని అనుకుంటున్నారు. దీంతో అదో రకమైన ఫ్యాన్ వార్స్ జరుగుతున్నాయి. అయితే వాటి లైఫ్ స్పాన్ చాలా తక్కువ. అయితే విజయ్ దేవరకొండ ఇప్పుడు చేసిన కామెంట్స్ మరోసారి పాత తరం ఫ్యాన్ వార్‌కి దారి తీసేలా కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. అదే ‘టాప్’లోకి వెళ్లి కూర్చుంటా అనే మాటలు.
వరుస పరాజయాలు, పరాభవాల తర్వాత విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ అనే సినిమాతో ఈ నెల 31న రాబోతున్నాడు. తాను చేసిందల్లా చేశానని, ఇక అంతా ‘ఆ నలుగురు’ చేతుల్లో పెట్టేశానని, నా చేతుల్లో ఏమీ లేదు అనే అదో రకమైన కాన్ఫిడెన్స్‌తో విజయ్ దేవరకొండ మాట్లాడుతున్నాడు. పోనీలే ‘అంతా నేనే అనే ఆలోచన నుండి.. అంతా మేమే’ అనే స్టైల్‌లోకి వచ్చాడు అని అనుకుంటుండగా.. మళ్లీ ‘టాప్’ టాపిక్ తీసుకొచ్చి లేని పోని చర్చకు కారణమయ్యాడు. దీనంతటికి ఇటీవల తిరుపతిలో జరిగిన ‘కింగ్డమ్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్.
విజయ్ దేవరకొండ తన సినిమాల ప్రచారంలో భారీ స్టేట్‌మెంట్స్ ఇస్తుంటాడు. అది అతని స్టయిల్. వాటిని పట్టుకుని మీడియా, సోషల్ మీడియా లాగుతూ లాగుతూ ఉంటుంది. దీంతో సినిమాకు, విజయ్‌కి ప్రచారం బాగా వస్తుంది. ఇది గతంలో మనం చూశాం కూడా. ఇప్పుడు అదే ఆలోచనతో చేశాడో లేక ఇండస్ట్రీలో టాప్ ప్లేస్ మీద గురి పెట్టాడో కానీ ‘‘తిరుపతి వెంకన్న సామి ఈ ఒక్కసారి నా పక్కనుండి నన్ను నడిపిస్తే చాలా పెద్దోణ్ని అవుతా. పోయి టాప్ లో కూర్చుంటా’’ అని అన్నాడు.
ఇక్కడ విజయ్ ‘టాప్’ అని.. ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ గురించి అన్నాడా? లేక విజయం సాధించి ఎత్తులో కూర్చుంటా అని అన్నాడా అనేది ఆయనకే తెలియాలి. అయితే ఇప్పుడు వరుస పరాజయాలతో ఎక్కడో కింద ఉన్న విజయ్.. టాప్‌లోకి రావాలి అనుకోవడం తప్పు కాదు. కానీ అమాంతం టాప్‌లోకి రావాలి అనుకుంటే ఆయనకే ఇబ్బంది. పోనీ సినిమా ప్రచారంలో కోసం ఫ్లోలో అన్నాడు అనుకుంటే ఎలాంటి పంచాయితి రాదు. లేదంటే లేనిపోని ఫ్యాన్ వార్స్ సోషల్ మీడియాలో జరుగుతాయి. దానికి కారణం విజయ్ దేవరకొండే అవుతాడు.