సమయం, సందర్భం లేకుండా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవాళ్లను ఏమంటారు? అసలు ఎందుకు పెడతారు అనే విషయం పక్కనపెట్టి అలాంటి వాళ్లను ఏమంటారు చెప్పండి? ఏంటీ సమాధానం సరిగ్గా దొరకడం లేదు. ఏమంటారు అనేది వదిలేసి… అలాంటి వాళ్లు ఎవరైనా ఉంటే చెప్పండి అంటే ఠక్కున వైజయంతి మూవీస్ అని చెప్పొచ్చు అంటున్నారు నెటిజన్లు. ఇటీవల ఆ ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియా పేజీలో వచ్చిన ఓ పోస్టు చూసి ఆ మాట అంటున్నారు మరి.
కావాలంటే ఓసారి మీరు కూడా చూడండి… అందులో ఏముందో తెలుస్తుంది? అయితే ఎందుకు ఇప్పుడు పోస్ట్ చేశారు అనేది చెప్పలేకపోవచ్చు. తర్వాత చూస్తాం, ముందు విషయం చెప్పేయమంటారా? ‘‘స్వచ్ఛత, అమాయకత్వం, శాంతికి సూచికగా అందరి హృదయాల్లో ఆమె స్థానం శాశ్వతం’’ అంటూ అతిలోకసుందరి శ్రీదేవి ఫొటో పెట్టి రాసుకొచ్చారు. ఇప్పుడెందుకు ఆమె గుర్తొచ్చింది… ఆమె గురించో, ఆ సినిమా గురించో ఏదో స్పెషల్ డే ఉంది అనుకుంటున్నారామో. అది కూడా లేదు. అసలు ఎందుకు పోస్ట్ చేశారు అనే విషయంలో కూడా స్పష్టత లేదు.
కానీ పోస్ట్ అయితే ఉంది. శ్రీదేవి (Sridevi) పుట్టిన రోజు ఆగస్టులో వస్తుంది. ఆమె ఈ లోకాన్ని విడిచింది ఫిబ్రవరిలో. ఇక ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమా రిలీజ్ డేటా అనుకుంటే ఆ సినిమా మేలో వచ్చింది. దీంతో ‘మా ఇంద్రజ’ అంటూ ఇప్పుడు ప్రత్యేకంగా ఆ ఫొటో షేర్ చేశారు అనేది అర్థం కావడం లేదు. అయితే కొందరు మాత్రం మొన్నీమధ్య ఆ నిర్మాణ సంస్థ నుండి వచ్చిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ నోటీసుకు దీనికి సంబంధం ఉంది అంటున్నారు.
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమాకుకి చెందిన హక్కులన్నీ మావేనంటూ… ఎవరు ఏ రూపంలో కాపీ కొట్టినా, స్ఫూర్తి చెందినా, రీమేక్ చేసినా చర్యలు తప్పవంటూ వైజయంతి మూవీస్ నోటీసు రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. చిరంజీవి కొత్త సినిమాను ఉద్దేశించే ఆ నోటీసు వచ్చిందని ఓ వర్గం అంటోంది. ఆ విషయంలో క్లారిటీ లేదు అనుకుంటుడగా ఇప్పుడు ‘మా ఇంద్రజ’ పోస్టర్ బయటకు వచ్చింది.