నాగార్జున టైటిల్ పాత్రలో టెర్రరిజం నేపధ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “వైల్డ్ డాగ్”. “ఊపిరి” చిత్రానికి రచయితగా పని చేసిన ఆశిషూర్ సాల్మన్ దర్శకుడిగా పరిచయమైన ఈ చిత్రం తొలుత నెట్ ఫ్లిక్స్ రిలీజ్ కి సన్నద్ధమైనప్పటికీ అనంతరం డీల్ ను మార్చుకొని మరీ థియేట్రికల్ రిలీజ్ వైపు మొగ్గు చూపారు. ఇండియాస్ బిగ్గెస్ట్ అండర్ కవర్ ఆపరేషన్ గా ప్రమోట్ చేయబడిన ఈ చిత్రం ఆ స్థాయిలో ఉందో లేదో చూద్దాం..!!
కథ: హైద్రాబాద్ గోకుల్ చాట్, పూణేలో జాన్స్ బేకరీ వంటి పబ్లిక్ ప్లేసెస్లో బాంబ్ బ్లాస్ట్స్ చేసిన టెర్రరిస్ట్ ఖాలిద్ ను అరెస్ట్ చేసిన ప్రాణాలతో ఇండియాకి తీసుకురావడం విజయ్ వర్మ (నాగార్జున) అండ్ టీం కర్తవ్యం. అందుకోసం ప్రాణాలను పణంగా పెట్టి విజయ్ వర్మ & టీం చేసిన ఆపరేషన్ పేరు “వైల్డ్ డాగ్”. ఈ ఆపరేషన్ సక్సెస్ అయ్యిందా? అందుకోసం టీం వైల్డ్ డాగ్ ఎన్ని వ్యయప్రయాసలు పడ్డారు? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం.
నటీనటుల పనితీరు: పోలీస్ పాత్ర నాగార్జునకు కొత్త కాదు. అయితే.. ఈ చిత్రంలో ఒక సరికొత్త నాగార్జునను చూస్తాం. నెరిసిన జుట్టు, గెడ్డంతో నాగార్జున డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ లో చక్కగా నటించారు. ఆయన పాత్రలో ఉన్న ఇంటెన్సిటీ కళ్ళలో కనిపించింది. సయామీ ఖేర్ పాత్ర చిన్నదే అయినప్పటికీ. ఎఫెక్టివ్ గా ఉంది. ఆమె ఫిజిక్, బాడీ లాంగ్వేజ్ క్యారెక్టర్ కు ప్లస్ అయ్యాయి. అలాగే.. టీం వైల్డ్ డాగ్ గా నటించిన టీం అందరూ క్యారెక్టర్స్ ను చక్కగా క్యారీ చేశారు. అతుల్ కులకర్ణి, దియా మీర్జాలు అతిధి పాత్రల్లో ఆకట్టుకున్నారు. నాగార్జున తర్వాత సినిమాలో అందరికీ బాగా నోటిఫై అయిన నటుడు టెర్రరిస్ట్ ఖాలిద్ పాత్ర పోషించిన నటుడు. కళ్ళతోనే క్రౌర్యాన్ని పండించాడు.
సాంకేతికవర్గం పనితీరు: “గూడచారి” చిత్రానికి తన కెమెరా లెన్స్ తో ప్రాణం పోసిన షానియల్ డియో “వైల్డ్ డాగ్” కూడా అదే తరహాలో ప్లస్ అయ్యాడు. యాక్షన్ బ్లాక్స్ కొరియోగ్రఫీ అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ.. వాటిని పిక్చరైజ్ చేసిన విధానం బాగుంది. అలాగే టింట్ & కెమెరా యాంగిల్స్ కథలోని ఇంటెన్సిటీని క్యారీ చేశాయి. తమన్ మ్యూజిక్ సినిమాలోని ఇంటెన్సిటీని ఎలివేట్ చేసింది. ప్రొడక్షన్ డిజైన్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త వహించి ఉంటే బాగుండేది. టైంలైన్ & కంటిన్యూటీ పరంగా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి.
ఇక దర్శకుడు రాసుకున్న కథ కొత్తది కాదు, డీల్ చేసిన విధానం కూడా ఆల్రెడీ చూసేసిన చాలా వెబ్ సిరీస్ లు, సినిమాల్లానే ఉండడంతో కథలో ఉన్న ఇంటెన్సిటీ ఆడియన్స్ కి కనెక్ట్ చేయలేకపోయాడు డైరెక్టర్ ఆశిషూర్ సాల్మన్. ముఖ్యంగా ఒటీటీల్లో భీభత్సమైన క్రేజ్ సంపాదించుకున్న “స్పెషల్ ఆప్స్, అవరోధ్” లోని చాలా బ్లాక్స్ ను సినిమాలో వాడేయడం, సెకండాఫ్ డీలింగ్ బాలీవుడ్ సినిమా “ఇండియాస్ మోస్ట్ వాంటెడ్”ని పోలి ఉండడం కూడా సినిమాకి మైనస్. ఎందుకంటే.. ఈ తరహా యాక్షన్ థ్రిల్లర్స్ ను మాస్ ఆడియన్స్ కంటే ఎక్కువగా మల్టీప్లెక్స్ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. వాళ్ళందరూ లాక్ డౌన్ టైంలో ఈ సినిమాలన్నీ చూసేశారు. దాంతో ఆ సీన్ ఇందులోది, ఈ సీన్ అందులోది అని మైండ్ లో సినిమా కంటే ఎక్కువగా సదరు సిరీస్ & సినిమాలు నడుస్తాయి. కథకుడిగా సాల్మన్ పర్వాలేదనిపించుకున్నా, దర్శకుడిగా మాత్రం బొటాబోటి మార్కులతో సరిపెట్టుకొన్నాడు. ముఖ్యంగా యాక్షన్ బ్లాక్స్ లో ఇంటెన్సిటీ మైంటైన్ చేయడంలో విఫలమయ్యాడు సాల్మన్. అందువల్ల మంచి కంటెంట్ ఉన్న “వైల్డ్ డాగ్” యావరేజ్ సినిమాగా మిగిలిపోయింది.
విశ్లేషణ: కొత్త దర్శకులను, కాన్సెప్ట్స్ ను ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడూ ముందుండే నాగార్జున సాల్మన్ కు ఛాన్స్ ఇస్తే.. ఆ గోల్డెన్ ఛాన్స్ ను సాల్మన్ పూర్తిస్థాయిలో సద్వినియోగపరుచుకోలేదు. అందువల్ల.. సినిమా అప్పుడప్పుడూ ఆసక్తిని రేకెత్తిస్తూ, ఎక్కువగా అనాసక్తిని కలిగిస్తూ ముగుస్తుంది. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ రెస్ట్రిక్షన్స్ వల్ల కూడా సినిమాకి ఎఫెక్ట్ పడింది. అయితే.. పైన పేర్కొన్న సిరీస్ & సినిమాలు చూడని ప్రేక్షకులు మాత్రం నాగార్జున హానెస్ట్ యాక్టింగ్ & టీం కష్టాన్ని అభినందిస్తూ “వైల్డ్ డాగ్”ను ఓ మోస్తరుగా ఎంజాయ్ చేయొచ్చు.