హ్యాట్రిక్ కొట్టి.. ఇప్పుడు సెకండ్ హ్యాట్రిక్ స్టార్ట్ చేయడానికి సిద్ధయ్యారు నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను. డిసెంబర్ 5న ‘అఖండ 2: తాండవం’ అంటూ సినిమాను రెడీ చేశారు. రిలీజ్ కోసం ప్రచారం కూడా చేసేస్తున్నారు. దీనికి సంబంధించి సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం భారీ స్థాయిలో విడుదల చేసింది. దానిని చూస్తే సినిమా ఎలా ఉండబోతోంది, ఏ కాన్సెప్ట్‌లో సాగబోతోంది అనే విషయాలను క్లియర్‌గా చెప్పేశారు బోయపాటి శ్రీను. క్లియర్‌గా చెప్పేశారు అనేకంటే గతంలో చేసిన ప్రయత్నాలే మరోసారి చేస్తున్నారు అని చెప్పారు.
బోయపాటి శ్రీను – నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో ఇప్పటివరకు మూడు సినిమాలు వచ్చాయి. ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ ఆ సినిమాలు. ఇప్పుడు ఈ కాంబినేషన్‌లో ‘అఖండ 2: తాండవం’ అనే సినిమా రాబోతోంది. ఈ సినిమాలో బాలకృష్ణ కుమార్తె తేజస్విని నిర్మాతగా మారుతున్నారు. దీంతో ఈ సినిమా ఫలితం బాలకృష్ణకు రెండు విధాలా కీలకం. మరోవైపు ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్‌లో రిలీజ్ చేస్తున్నారు. దీని గురించి ప్రచారం కూడా స్టార్ట్ చేశారు. అయితే పాన్ ఇండియా స్థాయిలో సినిమా లైన్ ఉందా? అనేదే ప్రశ్న.
ఈ సినిమా ట్రైలర్ చూస్తే తొలుత కలిగే అభిప్రాయం కొత్తగా ఏముందని చూస్తే.. అంతగా కొత్తదనం ఏమీ కనిపించడం లేదు. కథలో, కథనంలో ఎలాంటి కొత్తదనం లేదు అని చెప్పొచ్చు. ఏంటీ ట్రైలర్ చూసి ఆ మాట అనేస్తారా అని అనుకుంటున్నారా? మామూలుగా అయితే ట్రైలర్ చూసి చెప్పడం కష్టమే. కానీ ఈ ట్రైలర్ కట్ చూస్తుంటే ఓ చిన్నారికి ఇచ్చిన మాట కోసం ‘అఖండ’ వచ్చి ఎలా కాపాడాడు, ఆ చిన్నారికి వచ్చిన కష్టం ఏంటి అనేదే కథ అని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
దానికి హైంధవ ధర్మం, విదేశాల ఉగ్రవాదం, మన దేశంలో కుతంత్రాలు చేసే ఓ బ్యాచ్ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. మామూలుగా అయితే ఇది రెగ్యులర్ మాస్ కమర్షియల్ సినిమా లైన్. ఇలాంటి కథతో పాన్ ఇండియా స్థాయలో రిలీజ్ అంటే ఆలోచించాలి. అయితే హైందవ ధర్మం, దేశ రక్షణ లాంటి అంశాలు ఆసక్తికరం కాబట్టి ఫలితం చూడాలి.