ప్రముఖ కన్నడ నటుడు దర్శన్ కేసు మీకు గుర్తుందా? తన స్నేహితురాలు పవిత్ర గౌడతో కలసి అభిమాని రేణుకాస్వామిని హత్య చేశారు. కొన్ని నెలల క్రితం ఇది చాలా పెద్ద కేసు. వివిధ మలుపులు తిరిగి, దర్శన్ అరెస్టుకు కారణమైన ఈ కేసులో ఇటీవల దర్శన్‌కు బెయిల్ వచ్చింది. హైకోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. అయితే ఇప్పుడు ఆ బెయిల్ విషయమై సుప్రీం కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు న్యాయమూర్తి బెయిల్ విషయంలో ఇచ్చిన తీర్పును ప్రశ్నించింది.
దీంతో ఈ కేసు అడ్డం తిరిగింది అని చెప్పాలి. అంతేకాదు దర్శన్ బెయిల్ రద్దయి జైలుకు వెళ్లాల్సి వస్తుంది అనే చర్చ నడుస్తోంది. హైకోర్టు న్యాయాధికారం దుర్వినియోగమైందని సుప్రీం కోర్టు తన విచారణ సందర్భంగా వ్యాఖ్యానించింది. హైకోర్టు చేసిన తప్పునే తాము రిపీట్ చేయాలని అనుకోవడం లేదని కాస్త ఘాటుగానే చెప్పింది. ట్రయల్ కోర్టు ఇలాంటి పొరపాటు చేసిందంటే దానిని పరిగణనలోకి తీసుకోవచ్చని.. హైకోర్టు న్యాయమూర్తి అలా చేయడం సరికాదు సుప్రీం కోర్టు స్పందించింది.
హైకోర్టు తన విచక్షణాధికారం ఉపయోగించిన తీరుతో ఏకీభవించ లేకపోతున్నాం. బెయిల్ రద్దు చేయాలని బాధితుల వైపు వాళ్లు కోరుతున్నారు. మీ క్లయింట్ బెయిల్‌పై ఉన్నందున మీ వాదన కూడా వింటాం. హైకోర్టు ఇచ్చిన తీర్పును మీరు చూసే ఉంటారు అని దర్శన్ తరఫు న్యాయవాది కపిల్‌కి గత వారం జరిగిన విచారణ సమయంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఇప్పుడు తాజా విచారణలో ఈ మేరకు స్పందించారు. ఈ నేపథ్యంలో బెయిల్ రద్దు చేసి దర్శన్‌ను అరెస్టు చేస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి.
కర్ణాటకలో దర్శన్ అభిమాని అయిన రేణుకా స్వామి హత్య జరిగింది. చిత్రహింసలకు గురిచేసి హత్య చేసినట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఈ కేసులో దర్శన్, పవిత్ర గౌడతోపాటు 15 మందిని అరెస్టు చేశారు. ఈ కేసులో కర్ణాటక హైకోర్టు దర్శన్‌కు గతేడాది అక్టోబర్‌లో మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఆ తర్వాత డిసెంబర్ 13న కర్ణాటక హైకోర్టు రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది. దీనిని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాలు చేసింది. దానిపై విచారణలో భాగంగానే సుప్రీం కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.