తెలుగు సినిమా మార్కెట్ అంటే… కోస్తా, సీడెడ్, నైజాం అని అంటారు. కానీ పవన్ కల్యాణ్ సినిమాలకు నైజాం ఒక్కటేనా. తాజాగా ఆయన వ్యాఖ్యలు, ఏపీ ప్రభుత్వం నుండి వస్తున్న స్పందన చూస్తే అదే అనిపిస్తోంది. తెలుగు సినిమా కష్టాల గురించి ఇటీవల పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. దీంతో ఏపీ ప్రభుత్వం నుండి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అయ్యింది. మరోవైపు వపన్‌కు తెలుగు సినిమా నుండి సపోర్టు రాలేదు.
ఈ నేపథ్యంలో పవన్ రాబోయే సినిమాల పరిస్థితి ఏంటి అనేది తెలియడం లేదు. పవన్ కల్యాణ్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలున్నాయి. ‘భీమ్లా నాయక్’, ‘హరి హర వీరమల్లు’, ‘భవదీయుడు భగత్ సింగ్’తో పవన్ బిజీగా ఉన్నాడు. మొదటి రెండు సినిమాలు షూటింగ్ జరుగుతుండగా, మూడో సినిమా త్వరలో ప్రారంభమవుతుంది. అయితే ఈ సినిమాలు పూర్తయ్యాక విడుదల ఎలా అనేది ఇక్కడ ప్రశ్న. పవన్ ఆరోపణలు, విమర్శల నేపథ్యంలో ఏపీలో ఈ సినిమాల విడుదలకు ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.
ఎవరు ఎంత కాదన్నా ‘వకీల్ సాబ్’ విషయంలో ఏపీ ప్రభుత్వం కక్ష సాధించింది అని వసూళ్ల లెక్కలు చెబుతున్నాయి అంటున్నారు పరిశీలకులు. టికెట్ల ధరల విషయంలో ఏపీ ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవడంతో థియేటర్ల యజమానాలు, ప్రదర్శనకారులు, పంపిణీ దారులు తద్వారా నిర్మాత ఇబ్బందులు పడ్డారు. అయితే ఇప్పుడు రాబోయే సినిమాలకు ఇలానే ఉంటుందా? ఒకవేళ ఇదే జరిగితే… పవన్ సినిమాలు ఇక ఓటీటీకే అంటున్నారు పరిశీలకులు.