బాలీవుడ్‌ను ఆపేదెవరు?.. కరోనా పరిస్థితుల ముందు వరకు ఈ మాటే అనేవారు ఉత్తరాదిలో. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది, సినిమాల పరిస్థితీ మారింది. ఇప్పుడు చాలామంది ‘బాలీవుడ్‌ను తిరిగి పట్టాలెక్కించేది ఎవరు?’ అని అంటున్నారు. బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు, కుర్ర స్టార్ హీరోలు, హీరోయిన్ ఓరియెటండ్ సినిమాల నాయికలు.. ఇలా ఎవరూ ఇండస్ట్రీకి పూర్వ వైభవం తీసుకురాలేకపోతున్నారు. దీంతో ఇప్పుడు బాలీవుడ్ చూపు ప్రియాంక చోప్రా మీద పడింది అంటున్నారు. దీనికి కారణం ఆమె ఇండియాకు తిరిగి రావడమే.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఉన్న ప్రియాంక చోప్రా.. వరుస హాలీవుడ్ ప్రాజెక్టులు చేసి గ్లోబల్ స్టార్ అయిపోయింది. మూడేళ్లపాటు అక్కడే ఉండిపోయి బాలీవుడ్‌కి దూరమైంది. అయితే ఇప్పుడు వచ్చేసింది. దీంతో బాలీవుడ్‌లో చేయాల్సిన పాత ప్రాజెక్టులు, కొత్త సినిమాల చర్చలకు ఊపు వచ్చింది. విశాల్ భరద్వాజ్, సంజయ్ లీలా భన్సాలీతో సినిమాలు చేయడానికి గతంలోనే ప్రియాంక చోప్రా ఓకే చెప్పిందనే విషయం తెలిసిందే. త్వరలోనే వారితోతో కథా చర్చలు మొదలుపెట్టాలని ప్రియాంక చూస్తోందట.
ప్రఖ్యాత కవి, పాటల రచయిత అయిన సాహిర్ లూథ్వానీ జీవితం ఆధారంగా సంజయ్ లీలా భన్సాలీ ఓ సినిమా తెరకెక్కించాల్సి ఉంది. ఇది ఆయన కలల ప్రాజెక్టు అని చెప్పొచ్చు. అందులోనే ప్రియాంక చోప్రాను కథానాయికగా తీసుకుంటారని చెబుతున్నారు. ఇది కాకుండా కట్రినా కైఫ్, అలియా భట్‌తో ఒక లేడీ మల్టీస్టారర్ సినిమా చేయాల్సి ఉంది. ‘జీ లే జరా’ అనే ప్రాజెక్టు గురించి ప్రియాంక 2021లోనే ప్రకటించింది. అప్పుడు ముగ్గురూ కలసి ఉన్న ఓ ఫొటోను కూడా పోస్ట్ చేసింది.
అయితే కరోనా కారణంగా అర్ధాతరంగా నిలిచిపోయిన ఆ ప్రాజెక్టు 2023లో పట్టాలెక్కే అవకాశాలున్నాయి. ఫరాన్ అఖ్తర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఉంది. ఓ రోడ్ ట్రిప్ ఆధారంగా ఈ చిత్రం రూపొందిస్తారని అప్పట్లో వార్తలొచ్చాయి. ఈ సినిమాల ముచ్చట్లు వచ్చేసరికి.. ప్రియాంక అయినా బాలీవుడ్‌కి పూర్వ వైభవం తీసుకొస్తుందేమో అని అభిమానులు ఎదురుచూస్తున్నరని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.