2021 ఆరంభంలో సినీ పరిశ్రమ కోలుకునే అవకాశాలు ఉన్నట్టు కనిపించింది.మొదటి 3 నెలలు చిన్న, మీడియం రేంజ్ సినిమాలే విడుదలైనా.. వారానికి రెండు చొప్పున రిలీజ్ అవ్వడం జరిగింది. అవి కూడా బాగానే పెర్ఫార్మ్ చేయడంతో పెద్ద సినిమాల దర్శకనిర్మాతలు ఎగబడి తమ సినిమాల విడుదల తేదీలను ప్రకటించేసారు. కానీ కట్ చేస్తే ఏప్రిల్ చివర్నుండీ మళ్ళీ థియేటర్లు మూతపడ్డాయి.పెద్ద సినిమాల దర్శకనిర్మాతలు ప్రకటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు.
ఇక జూలై 30 నుండీ థియేటర్లు తెరుచుకున్నా పెద్దగా ఉపయోగం లేదు.ఆ రోజు విడుదలైన ఏ సినిమా కూడానా రూ.1 కోటి షేర్ ను కలెక్ట్ చేయలేకపోయింది. ఈ నేపథ్యంలో థియేటర్ వ్యవస్థ ఇప్పట్లో కోలుకునే అవకాశాలు లేవని స్పష్టమవుతుంది. పైగా మరోపక్క కరోనా కేసులు మళ్ళీ పెరుగుతుండడంతో జనాల్లో భయం పట్టుకుంది.అయితే .. పెద్ద హీరోలు మాత్రం తమ సినిమాల విడుదల తేదీలను పోటీపడి మరీ ప్రకటించేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తన ‘ఏకే’ రీమేక్ ను 2022 సంక్రాంతి దింపాలని భావిస్తున్నట్టు మేకింగ్ వీడియో ద్వారా స్పష్టం చేశారు.
ఇక ప్రభాస్ ‘రాధే శ్యామ్’ ను అదే సంక్రాంతికి అంటే జనవరి 14న విడుదల చేయబోతున్నట్టు, అలాగే మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ ని జనవరి 13న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. అంతేకాదు ‘ఎఫ్3’ కూడా జనవరి 15కి ఫిక్స్ అయ్యినట్టు టాక్ వినిపిస్తుంది. వినడానికి అద్భుతంగానే ఉంది.. కానీ నిజంగా విడుదలవుతాయా లేక ప్రకటనల వరకే పరిమితం అవుతాయా అనేది పెద్ద ప్రశ్న. ముందుగా రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్.ఆర్.ఆర్’ కనుక విడుదలైతే సంక్రాంతి రిలీజ్ ల పై డౌట్ పడనవసరం లేదు. ఆ సినిమా రిలీజ్ అయితే చాలా వరకు సినీ పరిశ్రమ కోలుకుంటుంది అనేది ఇండస్ట్రీ పెద్దలు చెబుతున్న మాట..! ఒక వేళ అది రిలీజ్ కాకపోతే మళ్ళీ అదే పరిస్థితి నెలకొంటుంది అనడంలో సందేహం లేదు.