అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన పుష్ప 2: ది రూల్ (Pushpa 2 The Rule) ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా, టికెట్ రేట్లపై చర్చలు హాట్ టాపిక్ గా మారాయి. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు పుష్ప 2 కోసం భారీ టికెట్ రేట్ల పెంపునకు అనుమతి ఇవ్వడం, దీన్ని బట్టి మరికొన్ని పెద్ద సినిమాలు కూడా ఇదే విధానం అనుసరిస్తాయా అనే ప్రశ్నలే ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నాయి. పుష్ప 2 ప్రీమియర్లు, అదనపు షోలకు భారీ రేట్లు ఫిక్స్ చేయడం, టిక్కెట్లు వేగంగా అమ్ముడవడం టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌ను ఏర్పరుస్తుందా? అనే సందేహం కలుగుతోంది.
పుష్ప 2 టికెట్ ధరలు మల్టీప్లెక్సుల్లో రూ.1200 వరకు వెళ్లడం, సింగిల్ స్క్రీన్‌లలో కూడా రేట్లు గణనీయంగా పెరగడం చూసిన తర్వాత, రాబోయే పెద్ద చిత్రాల మేకర్స్ కూడా ఈ తరహా అధిక రేట్లను ఆశించే అవకాశం ఉంది. ముఖ్యంగా రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న గేమ్ ఛేంజర్ (Game Changer) ఈ లిస్టులో ముందు ఉంటుందని అంటున్నారు. మేకర్స్ ఇప్పటికే భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌గా నిర్మిస్తున్న ఈ చిత్రానికి, టికెట్ రేట్ల విషయంలో పుష్ప 2 తరహాలోనే ప్రత్యేక అనుమతులు కోరే అవకాశం ఉంది.
అయితే ప్రశ్న ఏమిటంటే, టికెట్ రేట్ల హైక్స్ ప్రతీ చిత్రానికీ సఫలమవుతాయా? పుష్ప 2కి ఉన్న క్రేజ్, సీక్వెల్ అడ్వాంటేజ్, ఐకాన్ స్టార్ ఫ్యాన్ బేస్ వంటి అంశాలు ఈ నిర్ణయానికి మద్దతుగా ఉన్నాయి. కానీ ప్రతి పెద్ద సినిమాకీ అదే స్థాయి క్రేజ్ ఉంటుందా అనేది సందేహమే. ఇక గేమ్ ఛేంజర్ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఇప్పటివరకు హై రేంజ్ లో బజ్ క్రియేట్ కాలేదు. వచ్చిన టీజర్ కూడా ఎక్కువగా ఇంపాక్ట్ చేసినట్లు అనిపించలేదు.
ఇక ఇండియన్ 2 డిజాస్టర్ వలన శంకర్ మేకింగ్ పై మరిన్ని డౌట్స్ పుట్టుకొచ్చాయి. వచ్చిన సాంగ్స్ కూడా ఎక్కువ రోజులు సౌండ్ చేసింది లేదు. దీంతో టిక్కెట్ల రేట్లు పెంచితే అది మరో పెద్ద రిస్క్. పాన్ ఇండియా చిత్రాలకు హై రేట్లు వర్కౌట్ అయ్యే అవకాశం ఉన్నా, గేమ్ ఛేంజర్ మాత్రం ఇంపాక్ట్ సాధించడం కష్టమేనని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. మరి నిర్మాత దిల్ రాజు (Dil Raju) కేవలం సంక్రాంతిపై నమ్మకం పెట్టుకుంటాడా లేదంటే టిక్కెట్ల రేట్లను పెంచుతారా అనేది చూడాలి.