మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం “విన్నర్”. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సాయిధరమ్ సరసన రకుల్ ప్రీత్ కథానాయికగా నటించింది. “తిక్క”తో హీరోగా చతికిలబడ్డ సాయిధరమ్ ఈసారి మాస్ ఫార్ములాను నమ్ముకొన్నాడు. శివరాత్రి సందర్భంగా నేడు విడుదలయిన ఈ చిత్రం సాయిధరమ్ తేజ్ ను నిజంగా “విన్నర్”ను చేసిందా లేక మునుపటి చిత్రం “తిక్క” తరహాలో మరో ఫ్లాప్ ను ఖాతాలో వేసుకొన్నాడో తెలియాలంటే మా రివ్యూ చదవాల్సిందే..!!
కథ : చిన్నప్పుడే తండ్రి (జగపతిబాబు) మీద ద్వేషం పెంచుకొని పారిపోయిన కుర్రాడు సిద్దార్థ (సాయిధరమ్ తేజ్). తన తండ్రి తనకు దూరమవ్వడానికి కారణాలైన గుర్రాలను, రేస్ లను కూడా ద్వేషించడం మొదలుపెడతాడు. అలాంటి కుర్రాడికి రన్నింగ్ రేసర్ సితార (రకుల్ ప్రీత్)పై ప్రేమ పుడుతుంది. ఆమెను పెళ్లి చేసుకోవాలంటే హార్స్ రేస్ లో గెలవాలని హీరోయిన్ ఫాదర్ రూల్ పెడతాడు. అయితే.. తాను తలపడాల్సింది తాను వదిలేసి పారిపోయిన తండ్రినే అని తెలుసుకొంటాడు సిద్దార్థ. తండ్రి ఆప్యాయతను, ప్రియురాలి ప్రేమను గెలుచుకొని “విన్నర్”గా నిలిచాడా లేదా అనేది “విన్నర్” కథాంశం.
నటీనటుల పనితీరు : సాయిధరమ్ తేజ్ కెరీర్ లో ఇప్పటివరకూ పోషించిన వీక్ క్యారెక్టర్ గా “విన్నర్” చిత్రంలోని సిద్దార్థ పాత్రను చెప్పుకోవచ్చు. అసలు సాయిధరమ్ ప్రేక్షకులకు దగ్గరవ్వడానికి కారణమైన ఎనర్జిటిక్ డ్యాన్స్ మూమెంట్స్, ఎంగేజింగ్ ఫైట్స్ సీక్వెన్స్ లు ఒక్కటి కూడా “విన్నర్”లో లేకపోవడం పెద్ద మైనస్. రకుల్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా.. అందాల ఆరబోతతో అలరించింది. జగపతిబాబు స్టైలిష్ ఫాదర్ గా అందరికంటే బెటర్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకొన్నాడు. ఠాకూర్ అనూప్ సింగ్, ముఖేష్ రుషి, సురేష్ తదితరుల పాత్రలు ఏమాత్రం అలరించలేకపోయాయి. విపరీతమైన హైప్ క్రియేట్ చేసిన అనసూయ స్పెషల్ సాంగ్ అటు స్పైసీగానూ లేక, ఇటు ఆకట్టుకొనే విధంగానూ లేక నిరాశపరిచింది.
సాంకేతికవర్గం పనితీరు : తమన్ బాణీలు వినసోంపుగా ఉన్నాయి. బ్య్రాగ్రౌండ్ స్కోర్ విషయంలో జాగ్రత్తలు తీసుకొన్నాడు. ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ నిర్మాణ విలువలను ప్రతిబింబించింది. ఎడిటింగ్, స్టోరీ, స్క్రీన్ ప్లే సినిమాపి పెద్ద మైనస్. మాస్ ఎలిమెంట్స్ ను బాగా హ్యాండిల్ చేయగలిగిన దర్శకుడైన గోపీచంద్ మలినేని “విన్నర్” కథనాన్ని ఇంతగా సాగదీసాడో ఏ సినిమా అభిమానికీ అర్ధం కాదు. సినిమా మొత్తానికి కనీసం ఒక 10 నిమిషాలు కూడా ప్రేక్షకుడ్ని ఎగ్జైట్ చేయలేకపోయాడు. దర్శకుడిగానే కాక కథకుడిగానూ గోపీచంద్ మలినేని స్థాయిని దిగజార్చిన చిత్రం “విన్నర్”.
విశ్లేషణ : సాయిధరమ్ తేజ్ మునుపటి చిత్రం “తిక్క” కాస్త బెటరేమో అని ప్రేక్షకులు “విన్నర్” చూసినందుకు బాధపడుతూ బయటకొస్తుంటారు. విపరీతమైన సాగతీత, పస లేని కథ “విన్నర్” సినిమాకి పెద్ద మైనస్. సో, ఆ సాగతీతను తట్టుకోగలిగే సహనం ఉంటేనే “విన్నర్” చిత్రాన్ని చూసే సాహసం చేయాలి.