పేరుతోనే సినిమాకు అటెన్షన్ సంపాదించడం ఎలా? ఈ ప్రశ్నకు రీసెంట్ సమాధానం ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’. (Sreekakulam Sherlock Holmes) వెన్నెల కిషోర్ (Vennela Kishore) ప్రధాన పాత్రలో రైటర్ మోహన్ (Writer Mohan) దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. ఈ నెల 25న విడుదలవుతున్న నేపథ్యంలో దర్శకుడు సినిమా గురించి, సినిమా కథ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. అందులో పిక్ ఆఫ్ ది ఇంటర్వ్యూలో ఏంటంటే.. నిర్మాత చెప్పారని ఆయన ఈ కథను 70 మంది వినిపించారట. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. ఎవరూ నెక్స్ట్ ఏం జరుగుతుందని ఊహించలేకపోయారట.
రాజీవ్ గాంధీ హత్యకి గురైన రోజు జరిగే కథగా ఈ సినిమా ప్రారంభమవుతుందట. విశాఖ పర్యటన తర్వాత రాజీవ్ శ్రీపెరంబుదూర్ వెళ్లారు. అక్కడ హత్యకి గురయ్యారు. ఆ రోజునే సినిమాలో ఓ సంఘటన జరుగుతుంది. దాని చుట్టూనే సినిమా తిరుగుతుందట. సినిమా కథ అంటూ ఏడుగురు చుట్టూ సాగుతుందని, ఒక పాత్ర వెన్నెల కిషోర్ అని చెప్పారు. పోలీసు అధికారి కావాలని కలలు కనే కుటుంబం నుండి వెన్నెల కిషోర్ పాత్ర వస్తుందట. అయితే ఎందుకు డిటెక్టివ్ అయ్యాడు అనేదే పాయింట్.
ఇక ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభించడానికి ముందు ఈ కథను 70 మందికి వినిపించారు రైటర్ మోహన్. నిర్మాత అడగడంతోనే అలా చేశారట. ఈ క్రమంలో ఒక్కరు కూడా ఏ సీన్ తర్వాత ఏమొస్తుంది అని ఊహించలేకపోయారట. ఇక షెర్లాక్ హోమ్స్ అంటే అర్థం కాదేమో అని.. చంటబ్బాయ్ గారి తాలూకా అని ఆ సినిమాను, పాత్రను గుర్తు చేసే ప్రయత్నం చేశామని రైటర్ మోహన్ తెలిపారు.
ఇక రైటర్ మోహన్ (Writer Mohan) లైఫ్ గురించి చూస్తే.. ఆయన ఈవీవీ సత్యనారాయణ (E. V. V. Satyanarayana) దగ్గర రచయితగా తన ప్రయాణం ప్రారంభించారు. ఆ తర్వాత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali) , జీవిత రాజశేఖర్ (Jeevitha) తదితరుల దగ్గర రచనా విభాగంలో పని చేశారు. అలా రచయితగా అనుభవం సాధించాకే దర్శకత్వం వైపు వచ్చారు.