‘టాక్సిక్’.. పెద్దల సినిమా – ఈ మాట మేం అనడం లేదు. సినిమా ప్రచార చిత్రాలు చూసే ఎవరైనా అంటున్నారు. అందులోని కంటెంట్ అలా ఉంది మరి. ట్రైలర్ విషయంలో కాస్త ఓకే కానీ.. అంతకుముందు వచ్చిన టీజర్, సాంగ్ అలా ఉన్నాయి మరి. అయితే ఇప్పుడు ఆ సినిమా హీరో యశ్ మాత్రం ‘మా సినిమాలో ఒక్క ముద్దు సీన్ కూడా లేదు’ అని అంటున్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. యశ్ నిజంగానే ఈ మాట చెప్పాడా అనే ప్రశ్నలూ వినిపిస్తున్నాయి.
‘ఏ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్ అప్స్’ అంటూ సినిమాకు ట్యాగ్‌లైన్ పెట్టారు. సినిమా ప్రచార చిత్రాలు చూస్తే ఫెయిరీ టేల్ కాదు కానీ.. ఇంకేదో అనిపించింది. ఇప్పుడు అదే ఏ చర్చ యశ్ దగ్గరకు వెళ్తే.. తాను వల్గారిటీని సమర్థించను అని చెప్పాడు. అయితే సినిమాలో ఇంటిమేట్ సన్నివేశాలు ఉండటంలో తప్పేమీ లేదని, అయితే వాటిని తెరపై ఎలా చూపిస్తున్నాం అనేదే ముఖ్యమని యశ్ తనదైన శైలిలో చెప్పుకొచ్చాడు. ఇంటిమేట్ సీన్లను అందమైన పద్ధతిలో ప్రెజెంట్ చేయాలి అని చెప్పాడు.
ప్రచార చిత్రాలను చూసి మొత్తం సినిమాను అంచనా వేయడం సరికాదు అంటున్నాడు యశ్. టీజర్, ట్రైలర్, పాటల్లో కనిపించిన సన్నివేశాల వెనుక ఉండే ఎమోషన్ సినిమా చూసినప్పుడు అర్థమవుతుందంటున్నాడు. కథలో సందర్భం, ఉద్దేశం తెలుసుకుంటూ ఏదైనా సీన్ చూస్తే అసలు అర్థం తెలుస్తుందంటున్నాడు యశ్. టాక్సిక్’ సినిమాను కేవలం యాక్షన్ పిక్చర్‌గా చూడొద్దని కూడా కోరుతున్నాడు.
జనరేషన్ గ్యాప్, యువత ఆలోచనలు, పాతతరాలు పెట్టిన కొన్ని నియమాలు, వాటిపై కొత్త తరం వేసే ప్రశ్నల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుందని కాన్సెప్ట్ చెప్పే ప్రయత్నం చేశాడు. యశ్ ఎంత మంచిగా చెబుతున్నా.. ప్రచార చిత్రాలు ఇచ్చే ఇంపాక్ట్ చాలా ఎక్కువ. ఇప్పుడు ఈ ప్రచార చిత్రాలకు తగ్గట్టుగా సినిమా లేకపోతే థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు నిరాశపడతారు. అది సినిమాకు ఇబ్బందికరమైన విషయమే. ఇదంతా తెలిసీ సినిమా టీమ్ ఇలా ఎందుకు తమ సినిమాను ప్రొజెక్ట్ చేస్తోందో వారికే తెలియాలి.