Yashoda: ‘యశోద’ ఓటీటీ రిలీజ్ కు తొలగిన అడ్డంకులు!

  • November 29, 2022 / 04:59 PM IST

సమంత ప్రధాన పాత్రలో రూపొందిన ‘యశోద’ మూవీ నవంబర్ 11న రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. హరి, హరీష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ‘శ్రీదేవి మూవీస్’ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా ఈ మూవీ రిలీజ్ అయ్యి విజయం సాధించింది. ఇదిలా ఉండగా.. ఈ చిత్రం డిజిటల్ రిలీజ్ ను డిసెంబర్లో చేయడానికి మేకర్స్ అంగీకరిస్తూ అగ్రిమెంట్ పై సైన్ చేశారు. కానీ ‘యశోద’ సినిమాలో ‘ఈవా’ పేరు ఉపయోగించడం వల్ల హైదరాబాద్‌లో ‘ఈవా ఐవీఎఫ్’ ఆసుపత్రి వర్గాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కోర్టుకెక్కారు.

దీంతో ‘యశోద’ చిత్రాన్ని నిలిపివేయాలని, ఓటీటీలో విడుదలను కూడా వాయిదా వేయాలని ఆదేశిస్తూ మేకర్స్ కు నోటీసులు పంపింది. దీంతో నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ ‘ఈవా’ యాజమాన్యంతో మాట్లాడి సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కారించారు. సినిమాలో ‘ఈవా’ పేరును తొలగించినట్టు ఆయన పేర్కొన్నారు. శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ… ” ‘యశోద’ మూవీ మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. సినిమాలో మేం సరోగసీ ఫెసిలిటీ అని చూపించాం. దానికి ‘ఈవా’ అని పేరు పెట్టాం. కానీ అందుకు మేం ఇచ్చిన నిర్వచనం వేరు. అయితే, హైదరాబాద్ – వరంగల్‌కు చెందిన ‘ఈవా ఐవీఎఫ్’ ఫెర్టిలిటీ ఆసుపత్రి వారు సినిమా అనేది పవర్ ఫుల్ మీడియం కావడంతో…

‘యశోద’లో ఈవా అని చూపించడం అనేది వారికి ఇబ్బంది కలుగుతుందని కోర్టు ద్వారా న్యాయం కోసం ప్రయత్నించారు. థియేటర్లలో కాకుండా ఓటీటీ వరకు ఆ పేరు వాడకూడదని కోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. మాకు ఈ విషయం తెలియదు. ఒకరిని బాధ పెట్టే ఉద్దేశం గానీ, ఇతరుల మనోభావాలను కించపరిచే ఆలోచన గానీ మాకు అసలు లేదు. అందుకే, వెంటనే ‘ఈవా ఐవీఎఫ్’ ఆసుపత్రి వర్గాలను సంప్రదించాను. ‘సినిమా ఇండస్ట్రీ పట్ల మాకు గౌరవం ఉంది. మమ్మల్ని హర్ట్ చేసే విధంగా ఉంది. అందుకని, ఇలా చేశాం’ అని చెప్పారు. ‘ఈవా’ పేరు తీసేస్తామని నేను చెబితే…

అప్పుడు తమకు ఎటువంటి అభ్యంతరం లేదని తెలిపారు. పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అందుకు ఈ సందర్భంగా ‘ఈవా ఐవీఎఫ్’ వారికి, ఆస్పత్రి వర్గాలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సినిమాలో ‘ఈవా’ అనేదానిని తొలగించాం. భవిష్యత్తులో ‘యశోద’ సినిమాలో ఎక్కడా ‘ఈవా’ పేరు కనిపించదు. అయితే, థియేటర్లలో సినిమా విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. థియేటర్లలో పేరు మార్చాలంటే సెన్సార్ ద్వారా జరగాలి. ఆ తర్వాత కేడీఎంలు చేంజ్ చేయాలి. దానికి కొంత టైమ్ పడుతుంది. ఈ విషయం చెబితే… ‘ఈవా ఐవీఎఫ్’ ఆసుపత్రి వర్గాలు అంగీకరించాయి. నేను వాళ్ళ ఆసుపత్రికి వెళ్ళాను. ఆర్గనైజ్డ్ గా చేస్తున్నారు. మంచి సర్వీస్ అందిస్తున్నారు. మాకు ఈ విషయం తెలియక పేరు వాడడంతో చిన్న డిస్టర్బెన్స్ జరిగింది.

ఇప్పుడు ఆ సమస్యకు పరిష్కారం లభించింది. మేం ఇద్దరం హ్యాపీ” అంటూ ఆయన చెప్పుకొచ్చారు. అలాగే ఈ విషయం పై ‘ఈవా ఐవీఎఫ్’ ఎండీ మోహన్ రావు మాట్లాడుతూ… ”కొన్ని రోజుల క్రితం నేను మీడియా ముందుకు వచ్చి ‘యశోద’ లో మా ఆసుపత్రి పేరు ఉపయోగించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశాను. ఆ రెండో రోజు నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ గారు మమ్మల్ని సంప్రదించారు. కోర్టు ద్వారా మేం వ్యక్తం చేసిన అభ్యంతరాల పట్ల మాతో మాట్లాడారు.

ఈవా పేరు తొలగిస్తామని ఆయన అన్నారు. మాకు ఇచ్చిన మాట ప్రకారం తొలగించారు కూడా! ఆ రోజు ‘ఐదు కోట్లకు డ్యామేజ్ సూట్ వేశారు కదా?’ అని కొందరు ప్రశ్నించారు. అప్పుడు కూడా నేను చెప్పాను. డబ్బుల కోసం కేసు వేయలేను. దాని విలువ చెప్పాలని చేశాం. ఈవా ఐవీఎఫ్ బ్రాండ్ ఇమేజ్ డ్యామేజ్ కాకుండా చూడటం మా ఉద్దేశం. అందుకే కేసు వేశాం. మొన్ననే సాయంత్రం మాకు సినిమా చూపించారు. అందులో ఈవా పేరుకు సంబంధించినవి అన్నీ తొలగించారు. దీంతో మేము సోమవారం నాడు కోర్టుకు వెళ్లి… ‘యశోద’ నిర్మాత చేసిన మార్పులతో సంతృప్తిగా ఉన్నామని చెప్పాం.

అలాగే, కేసును ఉపసంహరించుకుంటున్నట్టు కూడా తెలిపాం. వెంటనే కోర్టు ఆమోదించింది. ఇరు వర్గాల అంగీకారంతో కేసు విత్ డ్రా చేసుకోవడం జరిగింది. ఈ సమస్య ఇంత త్వరగా పరిష్కారమవ్వడం నిజంగా ఆశ్చర్యం, ఆనందం కలిగిస్తుంది. నిర్మాతను సంప్రదిస్తే ఇంత త్వరగా పరిష్కారం లభిస్తుందని నేను అనుకోలేదు. అందుకే, చట్టబద్ధంగా కోర్టుకు వెళ్లాను. సినిమాలో చూపించిన విధంగా విదేశాల్లో జరిగి ఉండొచ్చు. మా దగ్గర ఎలా ఉంటుందనేది ఆసుపత్రికి నిర్మాతను తీసుకువెళ్లి చూపించాం. బయట ఎక్కడా సినిమాలో చూపించినట్టు జరగదు” అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus