ఇయర్‌ని ఎలా ప్రారంభించాం.. సీజన్లలో ఎలా అదరగొట్టాం అని మాత్రమే టాలీవుడ్ పెద్దలు అనుకునేవారు. దానికి కారణం దీపావళి సీజన్ తర్వాత తెలుగులో ఒకప్పుడు పెద్దగా సినిమాలు వచ్చేవే కావు. దీంతో పేరున్న టాలీవుడ్ సినిమా రిలీజ్‌లు అక్టోబరుతో ముగిసిపోయేవి. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. డిసెంబరు ఆఖరు వరకు సినిమాలు రిలీజ్ చేసేలా ప్లానింగ్ చేసుకుంటున్నారు. కొన్నేళ్ల క్రితం డిసెంబరు ఆఖరు వారం కాన్సెప్ట్‌లో నాగార్జున ఈ రిలీజ్‌లు స్టార్ట్ చేశారు. ఇప్పుడు చాలామంది ఆ వీక్‌ని టార్గెట్ చేస్తున్నారు. అలా ఈ సంవత్సరమూ ఇయర్ ఎండింగ్ సీజన్ భారీగానే ఉండబోతోంది.
మరీ అగ్ర కథానాయకుల సినిమాలు రావడం లేదు కానీ.. కాస్త పేరున్న హీరోల సినిమాలు, పెద్ద బ్యానర్ మీద తెరకెక్కుతున్న చిన్న హీరో సినిమా ఒకటి ఆ డేట్‌కి రెడీ అవుతున్నాయి. దీంతో టాలీవుడ్‌లో ఇయర్ ఎండింగ్ మజా భారీగానే ఉండబోతోంది. ఎందుకంటే క్రిస్మస్ పండగను టార్గెట్ చేసుకొని ఇప్పటికే అడివి శేష్ – మృణాల్ ఠాకూర్ ‘డెకాయిట్’ను సిద్ధం చేస్తున్నారు దర్శకుడు షానియేల్ డియో. తాజాగా రోషన్ ‘ఛాంపియన్’ను అప్పుడే తీసుకొస్తామని ప్రకటించారు. దీంతో పోటీ రసవత్తరంగా మారింది. వైజయంతి మూవీస్ ఈ సినిమాను నిర్మిస్తోంది.
నిజానికి ఈ సినిమాను ఎప్పుడో విడుదల చేయాల్సింది. ఎందుకో కానీ ఆలస్యమవుతూ వచ్చింది. ఇక ‘డెకాయిట్’ సినిమా పరిస్థితి కూడా అంతే. ఆ సినిమా నుండి శ్రుతి హాసన్ తప్పుకోవడంతో మృణాల్ ఠాకూర్‌ని తీసుకొని మరోసారి కాంబినేషన్ సీన్స్ షూట్ చేశారు. అలా రెండు లేటు సినిమాలు పోరు జరగబోతోంది. ఇక బాలీవుడ్ సినిమా ‘ఆల్ఫా’, హాలీవుడ్ సినిమా ‘అనకొండ’ కూడా ఆ డేట్‌కే వస్తున్నాయి. 1997లో వచ్చిన ‘అనకొండ’ సినిమాకు ఇది రీబూట్ అంటే రీమేక్‌కి ఎక్స్‌టెండెడ్ వెర్షన్ అని చెప్పొచ్చు. ఈ రెండు సినిమాలు కూడా తెలుగులో భారీగానే విడుదల చేయాలని టీమ్ ఫిక్స్ అయిందట. ఆ లెక్కన ఇయర్ ఎండింగ్ భారీగానే ఉండబోతోంది.