ఈ మధ్య యూట్యూబ్‌లో, మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్స్‌లో… ఇలా ఎక్కడ చూసినా ఎక్కువగా వినిపిస్తున్న పాటల్లో ‘ఏమున్నావే పిల్ల ఏమున్నావే’ ఒకటి. ‘నల్లమల’ సినిమాలోని గీతమిది. ఈ పాటకు ఇప్పటికే యూట్యూబ్‌లో కోట్ల వ్యూస్ వచ్చేశాయి. దీనిని రాసింది, బాణీ కట్టింది పీఆర్. మరి ఈ పాట కోసం ఆయనేం చేశారు, అసలు ఈ పాటలో ఉన్న పదాల అమరిక సంగతేంటి, పాటను ఎలా రాశారో చూద్దాం!
‘ఏమున్నావే ’ పాటను ఇప్పటికే మీరు వినుంటారు, ఒకవేళ వినకపోతే ఓసారి వినేసిరండి. అప్పుడు ఈ డీకోడ్ బాగా అర్థమవుతుంది. అమ్మాయి రంగుని పాలతో పోల్చడం, సొగసుని పూలతో వర్ణించడం… లాంటివి మనం చాలా సినిమా పాటల్లో విన్నాం. అయితే ఈ పాటలో అంతకుమించిన పదాలు, వివరణ కనిపిస్తాయి. అవే ఈ పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చాయి అని చెప్పొచ్చు. ఆ అమ్మాయి మేని రంగు పాలకన్నా తెల్లగా ఉంది… అని చెబుతూనే అడివంచు పల్లెలోని ‘లేత లేగదూడపిల్ల తాగే… పొదుగులోని పాలు’ అని డబుల్ ఫ్లేవర్ యాడ్ చేశారు పీఆర్.
ఆ అమ్మాయిది పువ్వు లాంటి సొగసు… దీన్ని ‘తేనెటీగలన్నీ సుట్టుముట్టేలా’ ఉన్నాయి అంటూ వివరణ ఇచ్చారు రచయిత. ఆ వెన్నెల నవ్వుని… ఇంకా అందంగా చెప్పేలా దట్టమైన అడవిని కమ్ముకున్న ‘కారుమబ్బు సీకట్లో…’ కనిపిస్తున్నట్టు రాశారు. చంద్రుడూ సిగ్గుపడి మబ్బెనక దాక్కున్నాడు అంటూ… చాలామంది అమ్మాయి అందాన్ని వివరించి రాశారు. ఈ పాటలో ‘సూరీడు సూడు పొద్దుదాటినా నిన్ను సూసి పోలేడే’ అని కొత్తగా రాశారు రచయిత. ఇదీ పాట లెక్క.