కన్నడ టీవీ కామెడీ షో నటుడు చంద్రశేఖర సిద్ధి ఆత్మహత్యకు గల కారణాన్ని కర్ణాటక పోలీసులు వెల్లడించారు. భార్య గొడవ పడి చీపురు, కట్టెతో కొట్టడంతోనే చంద్రశేఖర సిద్ధి ఆవేదనకు గురయ్యాడని యల్లాపుర గ్రామీణ ఠాణా పోలీసులు తెలిపారు. దీంతో ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు వెల్లడించారు. కేసు ప్రాథమిక దర్యాప్తులో ఈ విషయాన్ని గుర్తించినట్లు చెప్పారు. కామెడీ ఖిలాడిగలు రియాలిటీ షో మూడో సీజన్‌లో చంద్రశేఖర్ సిద్ధి కన్నడ ప్రేక్షకులకు పరిచయమయ్యారు.
జూలై 31న గురువారం చంద్రశేఖర సిద్ధి ఆత్మహత్య చేసుకుని మరణించిన విషయం తెలిసిందే. యల్లాపుర అటవీ ప్రాంతంలోని తాలూకా వజ్రళ్లి గ్రామ పంచాయతీ పరిధి చిమనహళ్లికి చెందిన చంద్రశేఖర సిద్ధి (31) ఆత్మహత్య ఘటన కొత్త మలుపు తీసుకుంది. సిద్ధి ఆర్థిక సమస్యలతో బలవన్మరణానికి పాల్పడ్డాడని తొలుత స్థానికులు, పోలీసులు భావించారు. అయితే భార్యతో జరిగిన గొడవ కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడని ఇప్పుడు తేలింది. త్వరలో ఈ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
టీవీ షో ద్వారా పేరు వచ్చినా సినిమాల్లో సరైన అవకాశాలు రాలేదని, అందుకే చంద్రశేఖర్ సిద్ధి ఆత్మహత్య చేసుకున్నాడని తొలుత అనుకున్నారు. సన్నిహితులు కూడా అలానే చెప్పారని సమాచారం. అయితే ఇప్పుడు పోలీసులు ఇలా చెప్పేసరికి.. అంతలా ఇద్దరి మధ్య ఏం జరిగింది అనేది అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ కేసు దర్యాప్తు ముందుకు వెళ్లే కొద్దీ మరిన్ని వివరాలు బయటకు వస్తాయి.