సినీ పరిశ్రమలో నిర్మాతలు (Producer) దేవుళ్ళతో సమానం. వాళ్ళు కనుక లేకపోతే ఒక సినిమాపై ఆధారపడ్డ వేల మంది జీవితాలు ఎంత దారుణంగా ఉంటాయో.. మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి నిర్మాతల్ని కూడా బడ్జెట్ లెక్కలతో చాలా మంది నలిపేస్తున్నారు. పెద్ద నిర్మాతలు అయితే వాళ్ళు తీసే చిన్న, మిడ్ రేంజ్ సినిమాలను పెద్దగా పట్టించుకోరు. స్క్రిప్ట్ దగ్గర తప్ప సెట్స్ పైకి వెళ్ళింది అంటే.. అక్కడికి నిర్మాతలు ఎక్కువగా వెళ్ళరు. దీంతో బడ్జెట్ లెక్కల్లో తేడాలు వచ్చేస్తాయి.
ఇటీవల సీనియర్ నిర్మాత సింగనమల రమేష్ (Singanamala Ramesh Babu) చెప్పినట్టు.. సెట్స్ కి వెళ్లి.. అక్కడ మొత్తం దగ్గరుండి చూసుకునే బాధ్యత ఉంటేనే సినిమాలు తీయాలి. లేదు అంటే ఇల్లు, వాకిలి అమ్ముకోవాల్సి వస్తుంది. కొత్త నిర్మాతల్లో ఈ డెడికేషన్ కనిపిస్తుంది. కానీ వాళ్ళను హీరోలు ఇబ్బంది పెట్టేస్తున్నారు. అది ఎలాగో ఒక ఉదాహరణ చెబుతా. ఓ యంగ్ హీరో ఉన్నాడు. మొదటి 2 సినిమాలు బాగా ఆడాయి. దీంతో అతని డిమాండ్ పెరిగింది. ఆ తర్వాత కూడా ఒకటి, రెండు హిట్లు ఇచ్చాడు.కానీ సమాంతరంగా 4 ప్లాపులు కూడా పడ్డాయి.
అయితే అతను ఒక నిర్మాతగా చేసిన సినిమా బాగా ఆడింది. దానికి డబ్బులు వచ్చాయి. దీంతో పారితోషికం డబుల్ మార్జిన్లో పెంచేశాడు. అందులో కూడా తప్పేమీ లేదు. ‘దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి’ అంటారు కదా. కానీ అతను చేసే సినిమాలకి మొత్తం అతని టీమే ఉండాలి అనే కండిషన్ పెడతాడట. తాను చెప్పిన వ్యక్తి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఉండాలి. ప్రమోషనల్ టీం అంతా కూడా అతని వాళ్ళే అయ్యి ఉండాలి. సరే.. వీటిలో కూడా తప్పులేదు.
కానీ ‘నిర్మాతని సెట్స్ కి రాకూడదు’ అనే కండీషన్ కూడా పెడతాడట ఈ యంగ్ హీరో. ఇవన్నిటికీ ఓకే అనుకుంటేనే సినిమా చేస్తాడట. అది కూడా అతని మావయ్యతో చెప్పిస్తాడనేది ఇన్సైడ్ టాక్. పాత నిర్మాతల వద్ద హీరో గారు పెట్టే కండీషన్స్ చెల్లవు. కొత్త నిర్మాతలు.. అతనికి ఆ విషయంలో నో చెప్పలేక ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం.