సినీ పరిశ్రమలో సెంటిమెంట్లకు కొదువ లేదు. ముహూర్తం షాట్ కి ముందు కొబ్బరికాయ కొట్టే టైం నుండి షూటింగ్ చివరి రోజు గుమ్మడికాయ కొట్టే వరకు మేకర్స్ చాలా సెంటిమెంట్లు ఫాలో అవుతూ ఉంటారు. పలనా ముహూర్తానికి సినిమా మొదలుపెట్టాలని, పలనా రిలీజ్ డేట్ కి సినిమా ఫినిష్ చేయాలని.. ఇలా ఒక్కటేంటి చాలా సెంటిమెంట్లు చూస్తూనే ఉంటాం. కొంతమంది హీరోల సినిమాలకి అభిమానుల అభిప్రయాలను అడిగి సెంటిమెంట్ ప్రకారం కలిసి రాని డేట్లకి సినిమాలు రిలీజ్ ఇవ్వకుండా ఉండటం.. లేదంటే కలిసొచ్చిన డేట్లకి సినిమాలు రిలీజ్ ఇవ్వడం వంటివి మనం చూస్తూనే ఉన్నాం.
ఈరోజు పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఓజీ’ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించింది చిత్ర బృందం. సెప్టెంబర్ 27న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు ఓ పోస్టర్ ద్వారా చిత్ర బృందం ప్రకటించడం జరిగింది. అదే డేట్ కి 2013 లో ‘అత్తారింటికి దారేది’ అనే సినిమా రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ కి కమర్షియల్ హిట్టు పడలేదు. ‘వకీల్ సాబ్’ ‘భీమ్లా నాయక్’ వంటి సినిమాలకి హిట్ టాక్ వచ్చినా.. అవి బ్రేక్ ఈవెన్ కాలేదు. అందుకే ‘ఓజీ’ సినిమాకి ‘అత్తారింటికి దారేది’ రిలీజ్ డేట్ కలిసి వస్తుంది అని నిర్మాత డీవీవీ దానయ్య భావిస్తున్నట్టు స్పష్టమవుతుంది. పవన్ కళ్యాణ్ సినిమాకి మాత్రమే కాదు.. గతంలో చాలా మంది హీరోల సినిమాలు సేమ్ రిలీజ్ డేట్ కి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆ సినిమాలు ఏంటో.. వాటి ఫలితాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
1) ముందుగా పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా 2013 సెప్టెంబర్ 27న రిలీజ్ అయ్యింది. 11 ఏళ్ళ తర్వాత అంటే 2024 సెప్టెంబర్ 27కి ‘ఓజీ’ రాబోతుంది.
2) విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా 2017 ఆగస్టు 25న రిలీజ్ అయ్యి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే 2022 ఆగస్టు 25 కి వచ్చిన ‘లైగర్’ మాత్రం పెద్ద డిజాస్టర్ అయ్యింది.
3) విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ‘కలిసుందాం రా’ సినిమా 2000 సంవత్సరం జనవరి 14న రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అయితే తర్వాత ‘దేవీ పుత్రుడు’ సినిమా 2001 జనవరి 14 న రిలీజ్ అయ్యి ప్లాప్ అయ్యింది. 2006 జనవరి 14న రిలీజ్ అయిన ‘లక్ష్మీ’ పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వగా, 2012 జనవరి 14న వచ్చిన ‘బాడీ గార్డ్’ అబౌవ్ యావరేజ్ గా నిలిచింది.
4) గౌతమీపుత్ర శాతకర్ణి -జై సింహా- వీరసింహారెడ్డి : 2017 జనవరి 12న రిలీజ్ అయిన బాలకృష్ణ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ మంచి హిట్ అయ్యింది. 2018 జనవరి 12న రిలీజ్ అయిన ‘జై సింహా’ డీసెంట్ సక్సెస్ అందుకుంది. 2023 జనవరి 13న రిలీజ్ అయిన ‘వీరసింహారెడ్డి’ సినిమా సూపర్ హిట్ అయ్యింది.
5) మహేష్ బాబు హీరోగా నటించిన ‘టక్కరి దొంగ’ 2002 జనవరి 12న రిలీజ్ అయ్యి ప్లాప్ అయ్యింది. 2024 జనవరి 12న రిలీజ్ అయిన ‘గుంటూరు కారం’ నెగిటివ్ టాక్ వచ్చిన కమర్షియల్ గా పర్వాలేదు అనిపించింది.
6) అల్లు అర్జున్ నటించిన ‘దేశముదురు’ చిత్రం 2007 జనవరి 12న రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయ్యింది. 2020 జనవరి 12న రిలీజ్ అయిన ‘అల వైకుంఠపురములో’ అయితే నాన్ – బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
7) చిరంజీవి నటించిన ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ సినిమా 1990 మే 9న రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయ్యింది. అలాగే ‘గ్యాంగ్ లీడర్’ సినిమా 1991 మే 9న రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అందుకుంది.
8) పవన్ కళ్యాణ్ దేవుడి పాత్రలో తెరకెక్కిన ‘గోపాల గోపాల’ సినిమా 2015 జనవరి 10న రిలీజ్ అయ్యి యావరేజ్ ఫలితంతో సరిపెట్టుకుంది.అయితే 2018 జనవరి 10న రిలీజ్ అయిన ‘అజ్ఞాతవాసి’ పెద్ద డిజాస్టర్ అయ్యింది.
9) నాని హీరోగా తెరకెక్కిన ‘జెండాపై కపిరాజు’ ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాలు 2015 మార్చి 21న రిలీజ్ అయ్యాయి. ఇందులో ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ డీసెంట్ సక్సెస్ అందుకోగా ‘జెండాపై కపిరాజు’ ప్లాప్ అయ్యింది.
10) రవితేజ హీరోగా తెరకెక్కిన ‘బలాదూర్’ సినిమా 2008 ఆగస్టు 14న రిలీజ్ అయ్యింది. ఇది యావరేజ్ ఫలితంతో సరిపెట్టుకుంది. అలాగే 2009 లో ‘ఆంజనేయులు’ సినిమా కూడా ఆగస్టు 14న రిలీజ్ అయ్యి కమర్షియల్ సక్సెస్ అందుకుంది.
11) ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘వర్షం’ మూవీ 2004 జనవరి 14న రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయ్యింది. అయితే 2007 జనవరి 14నే రిలీజ్ అయిన ‘యోగి’ మాత్రం జస్ట్ యావరేజ్ ఫలితంతో సరిపెట్టుకుంది.
12) రామ్ (Ram) హీరోగా రూపొందిన ‘మస్కా’ 2009 జనవరి 14న రిలీజ్ అయ్యి కమర్షియల్ సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత అంటే 2021 జనవరి 14న రిలీజ్ అయిన ‘రెడ్’ కూడా కమర్షియల్ సక్సెస్ అందుకుంది.
13) నాగార్జున హీరోగా రూపొందిన ‘మన్మధుడు’ 2002 డిసెంబర్ 20న రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. అలాగే 2007 లో డిసెంబర్ 20న రిలీజ్ అయిన ‘డాన్’ కమర్షియల్ సక్సెస్ అందుకుంది.
మరోపక్క 2022 జనవరి 14న రిలీజ్ అయిన ‘బంగార్రాజు’ హిట్ అవ్వగా, ఈ ఏడాది అంటే 2024 జనవరి 14న వచ్చిన ‘నా సామి రంగ’ కూడా సక్సెస్ అందుకుంది.